నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆర్థిక సంక్షోభం ఊబిలోకి నెట్టి ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు యూనియన్‌ ప్రయత్నిస్తుందని, అందుకు విపక్షాలతో చేతులు కలిపి కుట్రకు పాల్పడుతోందని టీఎస్‌ ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ ఆరోపించారు. ఒక పక్క యాజమాన్యంతో చర్చలు జరుగుతుండగానే ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెలోకి వెళ్లాయని, తిరిగి విధుల్లో చేరేందుకు వారంతా ముందుకు వచ్చిన విధుల్లోకి చేర్చుకునేలా నిర్ణయం తీసుకోవడం కూడా కష్టమేనని హైకోర్టుకు తేల్చి చెప్పారు.


ఆర్టీసీ సిబ్బంది కోసం కాకుండా ప్రతిపక్ష రాజకీయపారీ్టల కోసం ఆర్టీసీ యూనియన్‌ అడుగులు వేస్తోందన్నారు. ఆర్టీసీ ఉనికినే దెబ్బతీస్తుంటే యాజమాన్యం చేతులు కట్టుకుని కూర్చోబోదని చెప్పారు. యూనియన్‌లో కొందరి తప్పిదాల వల్ల ప్రజలు, ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ సంస్థ ఇబ్బందులు పడుతున్నా రని చెప్పారు. యూనియన్‌ మొండిగా వ్యవహరించిందని, బెదిరింపులకు దిగే క్రమంలోనే దసరాకు ముందు సమ్మెలోకి దిగారని చెప్పారు.


ఆర్టీసీ కారి్మకులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమని చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్‌ 22 ప్రకారం ఆరు వారాలు లేదా 14 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని, కన్సిలియేషన్‌ జరుగుతుంటే .సమ్మె  చేయటం  చట్ట వ్యతి రేకం అవుతుందన్నారు. చట్ట వ్యతిరేకంగా సమ్మెలోకి వెళితే నెల రోజులపాటు జైలు శిక్షతోపాటు జరిమానాలను విధించేందుకు వీలుందన్నారు.


యూనియన్‌ డిమాండ్లను పరిష్కరించే పరిస్థితుల్లో ఆర్టీసీ కార్పొరేషన్‌ లేదన్నారు. అగ్గి రాజేసి చలి కాచుకునే ధిక్కార ధోరణి. సమ్మె పాశుపతాస్త్రం లాంటిదని, అయినదానికీ కానిదానికీ దానిని ప్రయోగించకూడదని, సమ్మె హక్కు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుగా లేదన్నారు.యూనియన్‌ మొండి వైఖరిని అనుసరించిందనడానికి ఇదే పెద్ద నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్లీ విలీనం డిమాండ్‌ను తెరపైకి తెచ్చి ప్రభుత్వా న్ని అస్థిరపరిచే అవకాశాలు లేకపోలేదనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.


యూనియన్‌ సమ్మె వల్ల ఉన్న నిల్వ నిధులు కాస్తా ఖర్చు అవుతున్నాయని, నష్టాల నుంచి భారీ నష్టాల ఊబిలోకి వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చారని ఆరోపించారు. పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నష్టాల్లో ఉన్నప్పటికీ ఆర్టీసీ సిబ్బందికి 44% జీతాల పెంపు, 16% మధ్యంతర భృతి ఇచ్చామని చెప్పారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా హైకోర్టు సత్వరమే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: