తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప‌రిణామాల గురించి...ఆ పార్టీలోనే జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీలో ముఖ్య‌మైన అంశం గురించి ఏం జ‌రుగుతుందో...ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదంటున్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించుకున్నట్టు, రాజీనామా నిర్ణయాన్ని ఢిల్లీలోని ఏఐసీసీ నేతలకు తెలిపినట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, టీపీసీసీ అధ్యక్ష పీఠంపై ఇంకా ఉత్కంఠ వీడటం లేదు. శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో టీపీసీసీ చీఫ్ నియామకంపై నిర్ణయానికి వస్తారని పార్టీ వర్గాలో ప్రచారం జరిగిన‌ప్ప‌టికీ...అదింకా తేల‌లేదు. 


టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ అనుసరించిన వైఖరితోనే అసెంబ్లీ, స్థానికసంస్థలు, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలైందని ఆ పార్టీ నేతల అభిప్రాయం. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నా..వారిని అడ్డుకోవడంలో విఫలమయ్యారని, టీపీసీసీ అధ్యక్ష పదవినుంచి తప్పుకోవాలని పార్టీవర్గాల నుంచి డిమాండ్ వినిపించింది. కానీ, అధిష్ఠానం మాత్రం ఉత్తమ్‌నే అధ్యక్షుడిగా కొనసాగిస్తూ వచ్చింది. సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పట్టుపట్టి తన భార్యకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్నప్పటికీ గెలిపించుకోలేకపోయారు. భారీ మెజార్టీతో ఓటమి పాలవడంతో తప్పనిసరి పరిస్థితిలో టీపీసీసీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఇదిలా ఉంటే.. పార్టీలోని కొందరు నేతలు ఉత్తమ్ రాజీనామా చేశారని, మరికొందరు చేయలేదని పేర్కొంటున్నారు.


ఇలాంటి త‌రుణంలో...టీపీసీసీ పీఠాన్ని ఆశించే నేతల జాబితా పెరుగుతోంది. తనకు టీపీసీసీ పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. తన బయోడేటాను పార్టీ పెద్దలకు పంపించానని, ఈ నెల 20 తర్వాత ఢిల్లీ వెళ్లి అధిష్ఠానాన్ని అడుగుతానని చెప్పారు. ఇక టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వకూడదని సీనియర్లంతా ఆజాద్‌కు విజ్ఞప్తిచేశారు. మరోవైపు నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి టీపీసీసీ పీఠం దక్కే అవకాశం ఉన్నదని నేతలు బాహటంగానే చెప్తున్నారు. ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు నేతలు అధిష్ఠానానికి మొరపెట్టుకొన్నారు. పార్టీ పగ్గాలు ఎవరికి అందుతాయనే అంశంపై ఉత్కంఠత ఈ నెల 30 తర్వాతనే తేలనుంది. పార్టీ పగ్గాలు అప్పగించే అంశంపై గులాంనబీఆజాద్ మరోసారి ఉత్తమ్, భట్టితో మరోసారి చర్చించినట్టు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: