పేదరికాన్ని ఆసరాగా చేసుకుని అమాయక మహిళల్ని ముంచేస్తున్నారు.  దుబాయ్‌లో ఉపాధి అంటూ ఆశ చూపి దేశం కాని దేశం పంపించేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లాక.. వాళ్లు పెట్టే టార్చర్ తో నరకం అనుభవిస్తున్నారు మహిళలు. తాజాగా హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన మహిళను ఇలాగే అమ్మేసింది ఏజెంట్‌. 


హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహిళ పేరు జరీనాబేగం. భర్తతో గొడవలు రావడంతో కుమార్తెతో పాటు హైదరాబాద్ ఓల్డ్‌ సిటీలోని పుట్టింట్లో ఉంటోంది. కన్నవాళ్లకు భారం కాకూడదని టైలరింగ్‌ చేసుకుంటూ బిడ్డను పోషంచుకునేది. ఇదే సమయంలో దూద్ బౌలికి చెందిన అహ్మదితో పరిచయం అయింది. తనో ఏజెంట్‌గా పరిచయం చేసుకున్న అహ్మది... దుబాయ్‌ పంపుతానని మాయమాటలు చెప్పింది. అక్కడ బ్యుటీషియన్‌గా చేయాలని చెబితే నిజమేనని నమ్మింది. ఆమెతో పాటు ఢిల్లీకి చెందిన  హాజీ మహ్మద్‌ కలిసి... జరీనాను గత అక్టోబర్ 15న షార్జా పంపారు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత 2 లక్షలకు తనను అమ్మేసినట్టు తెలుసుకుంది. 


తర్వాత జరీనా అక్కడ నరకం చూసింది. ఇంట్లో నిర్బంధించి ఆమెను తీవ్రంగా కొట్టేవారట. కనీసం తిండి కూడా పెట్టేవారు కాదట. అతి కష్టం మీద తన పరిస్థితిని అక్కకు తెలపడంతో... ఆ నరకం నుంచి బయటపడగలిగింది. కూతురి చదువు కోసం డబ్బు సంపాదిద్దామని వెళ్తే ఇలా నిలువునా మోసం చేశారని కన్నీళ్లు పెట్టుకుంది. జరీనాబేగంను మోసం చేసిన అహ్మదితో పాటు ఢిల్లీకి చెందిన హాజీ మహ్మద్‌పై సంతోష్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు బంధువులు. 


మొత్తానికి ఏదో ఒక విధంగా ఆ మహిళ బయటపడగలిగింది. ఇలాంటి వారెందరో విదేశాల్లో మగ్గుతున్నారు. రకరకాల ఆర్థిక కారణాలతో ఇబ్బంది పడుతున్న వారిని.. ఘరానా మోసగాళ్లు సులువుగా గుర్తించేస్తున్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని.. మాయ మాటలు చెప్పి నమ్మించి బుట్టలో వేసుకుంటున్నారు. తర్వాత సదరు వ్యక్తులకు తెలియకుండా అమ్మకానికి పెట్టి ఉడాయిస్తున్నారు. తీరా జరిగింది తెలిశాక బాధితులు లబోదిబోమంటున్నారు. కాబట్టి ఎవరిని పడితే వాళ్లను నమ్మకూడదనే విషయాన్ని పోలీసులు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: