రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన వెంట‌నే ఘ‌న విజ‌యం సాధించిన ప్ర‌స్తుత ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఊహించ‌ని చిక్కుల్లో ప‌డ్డారు. . ఈస్ట్‌ఢిల్లీ స్థానం నుంచి తొలిసారి బీజేపీ తరఫున పోటీ చేసిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఘన విజయం సాధించారు. అయితే, తాజాగా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ మిస్సింగ్‌ పోస్టర్లు ఈస్ట్‌ ఢిల్లీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఆప్‌ కార్యకర్తలు ఢిల్లీ మీకోసం వెతుకుతోంది గంభీర్‌ అంటూ ఎక్కడపడితే అక్కడే పోస్టర్లు అతికించారు. క్రికెటర్‌గా మారిన పొలిటిషన్‌ చివరిసారిగా ఇండోర్‌ స్టేడియంలో కనిపించి తరువాత మాయమయ్యాడని ఆప్‌ నేతలు ఆరోపిస్తున్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్న గంభీర్‌..ప్రజలు వాయుకాలుష్యంతో అల్లాడుతుంటే పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.


ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోగా...గౌతం గంభీర్ మాత్రం త‌న సొంత ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఇండోర్‌లో జరిగిన భారత్‌-బంగ్లాదేశ్‌ తొలి టెస్టుకు గౌతీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. మ‌రోవైపు,  పొల్యుషన్‌కు సంబంధించిన అంశంపై అర్బన్‌ డెవలప్‌మెంట్‌ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నవంబర్‌ 15న సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కీలక సమావేశానికి ఎంపీలు, ప్రభుత్వాధికారులు హాజరుకాకపోవడంతో సమావేశాన్ని రద్దు చేశారు. సమావేశానికి గైర్హాజరైన గంభీర్‌పై ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అతిషితో పాటు నెటిజన్లు సోషల్‌ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీరు మాత్రం జిలేబీలు, అటుకులతో చేసిన చాట్‌ తింటూ ఎంజాయ్‌ చేస్తున్నారని మండిపడుతున్నారు. 


ఎందుకంటే, ఇదే స‌మ‌యంలో...ఇండోర్‌లో ఓ ఫుడ్‌ కోర్టు దగ్గర గౌతమ్‌ గంభీర్‌తో కలిసి బ్రేక్‌ ఫాస్ట్‌ చేస్తున్న ఫొటోలను క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఆప్‌ ఈ ఫొటోలను ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌ లో ఈ ఆరోపణలు చేసింది. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి ఎంసీడీ కమిషనర్‌, డీడీఏ వైస్‌ ఛైర్మన్‌, వాతావరణ విభాగం సెక్రటరీ, జాయింట్‌ సెక్రటరీతోపాటు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు సమావేశానికి రాలేదు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి 21 మంది లోక్‌సభ ఎంపీలు, ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలు హాజరుకావాల్సి ఉండగా..కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే హాజరవ‌డం, గైర్హాజ‌రులో గంభీర్ ఉండ‌టంతో ఆయ‌న‌పై ఆప్ విరుచుకుప‌డుతోంది.
========



మరింత సమాచారం తెలుసుకోండి: