కేంద్ర ప్రభుత్వం అనుకున్నంత పనీ చేస్తోంది. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లను విక్రయించాలని నిర్ణయించేసింది. తలకు మించిన భారంగా మారుతున్నాయన్న కారణంతో వీటికి మంగళం పాడాలని డిసైడయ్యింది. వీటి అమ్మకానికి ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నట్టు సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చేశారు.


ఇందుకు డెడ్ లైన్ కూడా విధించుకున్నారు. వచ్చే ఏడాది మార్చి 2020 కల్లా ఈ రెండు సంస్థలను అమ్మేస్తారట. ఇంధన ధరలు పెరిగిపోవడం, విదేశీ రూట్లలో నష్టాల కారణంగా ఎయిరిండియా ఇప్పటికే నష్టాల్లో ఉంది. అందుకే ఇంకా నష్టాలు తెచ్చుకోవడం కంటే అమ్మేయడం బెటర్ అని కేంద్రం ఫీలవుతోంది. నష్టాల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం 76 శాతం వాటాను ఉపసంహరించుకోవాలని ముందు అనుకుంది. అయితే, వాటాల కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. అందుకే ఇక గంప గుత్త అమ్మేయడమే శరణ్యమని భావిస్తోంది.


భారత పెట్రోలియం విషయానికి వస్తే.. ఇందులో తనకున్న 53.29 శాతం వాటాను అమ్మేందుకు కేంద్రం గత నెలలోనే పచ్చజెండా ఊపింది. ఈ మొత్తం విలువ దాదాపు రూ.65 వేల కోట్ల రూపాయలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి అమ్మకాల ద్వారా లక్ష కోట్ల రూపాయలను సమీకరించాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకుంది.


అసలే ఓ వైపు ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్నవేళ.. ఈ నిర్ణయం తమకు ఆర్థికంగా చేదోడుగా ఉంటుందని కేంద్రం భావిస్తోంది. అందుకే ఈ ఆర్థిక సంవత్సరంలోనే వీటి విక్రయాన్ని పూర్తిచేయాలని డిసైడైంది. ఆర్థిక మందగమనాన్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం సరైన మార్గంలో పయనిస్తోందని మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా కామెంట్ చేశారు. పన్నుల వసూలు విషయానికొస్తే కొన్ని రంగాలలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని ఆమె అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: