మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇంకా ఉత్కంఠ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి విషయంలో వివాదం తలెత్తడంతో ఎన్డీఏ నుంచి శివసేన బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు శివసేన ప్రయత్నాలు చేస్తున్నది. ఈ స‌మ‌యంలోనే... బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మ‌హారాష్ట్ర స‌ర్కారు విష‌యంలో...ఆందోళన అనవసరమని, అక్కడ శివసేనతో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ఆయ‌న ప్ర‌క‌టించారు.


పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఆర్పీఐ పార్టీ అధ్య‌క్షుడు, కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథావలే పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ  మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం విష‌యంలో...త‌న అభిప్రాయం వ్య‌క్తం చేయ‌గా,  ‘మీరు మధ్యవర్తిత్వం వహిస్తే ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని నేను అమిత్‌షాతో చెప్పగా.. ఆందోళన అవసరం లేదు. అంతా సర్దుకుంటుంది. బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయని ఆయన నాతో అన్నారు’ అని అథావలే వివరించారు.


బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కామెంట్ల నేప‌థ్యంలో,  శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్ ఘాటుగా స్పందించారు. మహారాష్ట్ర ఈ నెలాఖరులోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అసెంబ్లీలో తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్ర‌క‌టించారు.  ‘అసెంబ్లీ వేదికగా మా బలం (శివసేన) ప్రదర్శిస్తాం. మాకు 170 మంది ఎమ్మెల్యే మద్దతు ఉంది. వీరి మద్దతుతో శివసేన ప్రభుత్వం ఐదేళ్ల‌పాటు కొనసాగుతుంది’ అని చెప్పారు.  బీజేపీతో పొత్తు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెగదెంపులైన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం కాంగ్రెస్‌, ఎన్సీపీ మద్దతు కోరుతున్నట్లు తెలిపారు.  కాంగ్రెస్‌, శివసేన, ఎన్సీపీ మధ్య కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) కోసం చర్చలు జరిగాయన్నారు. ‘శివసేనను బీజేపీ మోసగించింది. ప్రజలంతా బీజేపీతో లేరు. ఆ పార్టీతో కలిసి ఎవరూ వెళ్లరు’ అని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: