ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో దొంగనోట్లు కలకలం రేపుతున్నాయి. విధి నిర్వహణలో ఉన్న సమయంలో కొందరు ప్రయాణికులు 50, 100, 200 రూపాయల దొంగనోట్లు ఇస్తూ ఉండటంతో వాటిని గుర్తించలేకపోతున్నామని కండక్టర్లు చెబుతున్నారు. ప్రయాణికులలో కొందరు దొంగనోట్లు ఇస్తూ ఉండటంతో వాటి స్థానంలో చేతి నుండి నోట్లను డిపోకు జమ చేయాల్సి వస్తుందని కండక్టర్లు ఆవేదన చెందుతున్నారు. 
 
గత కొన్ని నెలలుగా అవనిగడ్డ బస్ డిపోకు సంబంధించిన వివిధ రూట్లలో ప్రయాణించే సర్వీసులలో కండక్టర్లు ప్రయాణికుల నుండి డబ్బులు వసూలు చేసే సమయంలో తగిన సమయం లేకపోవటంతో ప్రయాణికులు ఇచ్చేది అసలు నోటా...? దొంగ నోటా...? అనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ప్రయాణికులు ఇస్తున్న దొంగనోట్లను ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప కనిపెట్టలేకపోతున్నామని కండక్టర్లు చెబుతున్నారు. 
 
విధులు పూర్తయిన తరువాత డిపోల్లో నగదు జమ చేసే సమయంలో దొంగనోట్లు వస్తున్నాయని తెలుస్తోందని కండక్టర్లు చెబుతున్నారు. గడచిన 30రోజుల్లో నాలుగుసార్లు అధికారులు దొంగనోట్లను గుర్తించారు. ఆర్బీఐ కొత్తగా ముద్రించిన 50రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు మాత్రమే దొంగనోట్లుగా వస్తున్నాయని  కండక్టర్లు చెబుతున్నారు. విజయవాడఅవనిగడ్డ రూట్లలో ప్రయాణించే బస్సులలో ఎక్కువగా దొంగనోట్లు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. 
 
కండక్టర్లు ఎంత మేర దొంగనోట్లు వచ్చాయో అంత మేర నగదును వారి జేబుల్లోంచి చెల్లించాల్సి వస్తోంది. దొంగనోట్లు వచ్చినా అధికారులు పట్టించుకోవటం లేదని దొంగనోట్ల వలన తీవ్రంగా నష్టపోతున్నామని నష్టపోయిన ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. విజయవాడ పరిసరప్రాంతాల్లో దొంగనోట్లు ప్రజల్లోకి వెళుతున్నాయని దొంగనోట్లను గుర్తించలేని ప్రజలు ఆ నోట్లను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. సాధారణ ప్రజలు దొంగనోట్లను గుర్తించలేకపోవటంతో ఈ సమస్య ఎదురవుతోందని తెలుస్తోంది. కండక్టర్లు, ఆర్టీసీ అధికారులు దొంగనోట్ల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. 


 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: