తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఆర్టీసీ స‌మ్మెపై విప‌క్షాలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం మెట్టు దిగేందుకు సిద్ధ‌ప‌డ‌క‌పోవ‌డం, ఆర్టీసీ కార్మికులు స‌మ్మె కొన‌సాగిస్తున్న నేప‌థ్యంలో...ఆర్టీసీ కార్మికుల స‌మ్మె కొన‌సాగుతోంది. ఈ అంశంలో విప‌క్షాల‌న్నీ ఏక‌మైన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై మండిప‌డుతున్నాయి. ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌పై సైతం విరుచుకుప‌డుతున్నాయి. తాజాగా బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణ సాగర్ రావు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లో ఉందని అన్నారు. ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు , టీఆర్ఎస్‌ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తిరుగుబాటు చేయాలని కోరారు.


యాభై వేల మంది ఆర్టీసీ కార్మికుల వారి కుటుంబాలు రోడ్లపై ఉంటే , పదుల సంఖ్యలలో కార్మికులు చనిపోతుంటే ఒక్క మాట కూడ మాట్లాడకుండ ఉంటున్న టీఆర్ఎస్ నాయకులకు సిగ్గులేదా అని  కె.కృష్ణ సాగర్ రావు ప్ర‌శ్నించారు. ఆ నాయ‌కుల‌కు అన్నం ఏవిధంగా తినబుద్ది అవుతుందని ఆయ‌న ప్ర‌శ్నించారు. ``మంత్రి హరీశ్‌రావు ఎక్కడ ఉన్నవయ్యా? నువ్ ఉద్యమకారుడవేనా.....? ఢిల్లీలో తెలంగాణ భవన్లో చెంపలు పగిలేలా కొట్టావ్, ఈరోజు ఏమైంది నీ పౌరుషం? మంత్రి ఈటల రాజేందర్ ....ఓనర్ షిప్ గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడినవ్ కదా? కార్మికులు చనిపోతుంటే మాట్లాడరా? అవకాశవాద రాజకీయాల కోసం, ఇతర పార్టీలిచ్చే పదవుల కోసం , అధికారం కోసమే తిరుగుబాటు చేస్తారా..?ప్రజాస్వామ్యంలో ప్రజలు, లక్షలాది మంది ఉద్యోగుల హక్కులు ప్రమాదం లో ఉంటే తిరుగుబాటు చేయరా...?`` అని మండిప‌డ్డారు.


సునీల్ శర్మ  లాంటి అమ్ముడుపోయిన అధికారిని జైల్లో పెట్టాలని కృష్ణ‌సాగ‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``ఈ రోజు కోర్టులో ఈవిధమైన తీర్పు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవ‌స‌రం లేదు. సునీల్ శర్మ కోర్టుకు ఇచ్చిన ఆఫిడ‌విట్  ఆయన రాజకీయ బానిసత్వానికి అద్దం పడుతోంది. ఆర్టీసీ కార్మికులు బహిరంగ ప్రదేశాల్లో దీక్ష చేయనివ్వడం లేదు. రోడ్లపైకి వస్తే పోలీసుల జులంతో రోడ్లన్నీ రక్తసిక్తం చేస్తున్నారు. కార్మికనేతలు తమ సొంత ఇళ్లలో కూర్చొని నిరాహార  దీక్షలు చేసే స్వేచ్ఛ వారికి లేదా..? వాళ్ళ ఇళ్ల తలుపులు పగలగొట్టి అక్రమంగా అరెస్టులు చేసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు....? ఇది కేసీఆర్ మార్క్ నిరంకుశత్వం కాదా....? సీఎం కేసీఆర్ వైఖరిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది నక్సలైట్లతో చర్చలు చేసిన రాష్ట్రం..సీఎం కేసీఆర్ కార్మికులతో చర్చలు జరుపడానికి ఎందుకు భయపడుతున్నారు.సీఎం స్థాయిని కేసీఆర్ తగ్గించారు. కేసీఆర్ నాయకుడు కాదు. నియంత.`` అని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తన ముసుగు తొలగించి అసలు రూపం చూపిస్తున్నారని మండిప‌డ్డారు. కేసీఆర్  తన సహచరులను కూడా బానిసలను చేశాడని మండిప‌డ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: