ఏపీలో విపక్షాలకు సబ్జెక్ట్ కరువు అయిపోయింది. నిజానికి రాష్ట్ర రాజకీయాల్లో సరైన అంశమే లేకుండా ఉందట. ఇసుక కొరత అంటూ మూడు నెలలుగా అల్లల్లాడించిన విపక్షాలకు అసలు కొరత సమస్యలు లేకపోవడమేనని వైసీపీ నేతలు అంటున్న మాటలు నిజమేననిపిస్తున్నాయి. లేకపోతే ఊహాజనితమైన కధనాలు వండి వారుస్తున్న కుల పత్రికలను చూసి చెలరేగిపోతున్న తమ్ముళ్ల వైనానికి ఎవరు జవాబు చెబుతారు మరి.


ఏపీలో ఇసుక ఇష్యూ క్లోజ్. ఆ విషయాన్ని పవన్ స్వయంగా ప్రకటించేశారు. తమ పోరాటాలకు జగన్ రెడ్డి దిగి వచ్చేశారని సంబరపడ్డారు. ఇందుకు సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా ట్విట్టర్ ముఖంగా పవన్ తెలియచేశారు. అంటే ఇక ఇసుక సమస్యపై విపక్షం నోరెత్తదన్నమాటే. ఇక మరో వైపు వరదలు కూడా లేకపోవడంతో ప్రభుత్వం కావాల్సినంత ఇసుకను సరఫరా చేస్తోంది. దానికి రేటును కూడా నిర్ణయించి ఇసుక  స్టాక్ పాయింట్లు, నంబర్లతో సహా వివరిస్తూ పెద్ద అడ్వర్టైజ్ మెంట్లే ఇచ్చేసింది.


అక్రమంగా ఇసుక సరఫరా చేసినా దోచుకున్నా కూడా రెండేళ్ళు  జైలు  శిక్ష తో పాటు రెండు లక్షల జరీమానా కూడా విధిస్తూ ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు టోల్ ఫ్రీ నంబర్ ని కూడా జగన్ ఆవిష్కరించారు. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో ఇంగ్లీష్ సమస్యను మరింతగా వండి వార్చడానికి విపక్షాలు రెడీ అవుతున్నాయి. దీనికి మతం రంగు కూడా పులుముతున్నాయి. ఓ అనుకూల పత్రికలో రాసిన కధనాన్ని పట్టుకుని అపుడే తమ్ముళ్ళు రెచ్చిపోతునారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది మొత్తానికి మొత్తం బీసీలను క్రిస్టియన్లలో కలిపేస్తారట. ఇది రహస్య అజెండాట. దాన్ని తానే కనుగొన్నట్లుగా ఆ మీడియా  వూహాగానాలన్నీ తోచినవి రాసేసింది. ఇక దీంతో జగన్ మీద మతం కార్డు ప్రయోగించేందుకు  ప్రతిపక్ష నేతలు  రెడీ అయిపోతున్నారని తెలుస్తూనే ఉంది.


నిజానికి హిందూ కార్డు అంటే బీజేపీ సొంతం. ఆ పార్టీ ఎపుడూ వాడుకునే కార్డు. ఇపుడు దాన్ని పెద్ద గొంతు చేసుకుని టీడీపీ తీసేసుకుంది. మధ్యలో జనసేన పవన్ కల్యాణ్ సైతం హిందువులు, క్రిస్టియన్లు ఇలా చెబుతూ జగన్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.  అంటే ఇంగ్లీష్ భాష క్రిస్టియన్లది అని వీరంతా నిర్దారించేస్తున్నారు. మరి వీరు ఇంగ్లీష్ ఎంత మాట్లాడినా  క్రిస్టియన్లు కానపుడు వీరి పిల్లలను ఇంగ్లీష్ మీడియం లో చదివిస్తున్నపుడు లేని బాధ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ ప్రవేశపెడితే తప్పు వచ్చిందా అన్నదే పెద్ద ప్రశ్న. అంటే జగన్ ఎక్కడా దొరకకపోతే మతం కార్డు తోనైనా ఎదుర్కోవాలి అనుకుంటున్నారన్నమాట. చూడాలి మరి ఇది ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: