రాజ్ భవన్ లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను సీఎం జగన్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ కు సీఎం జగన్ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. త్వరలో జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల గురించి కూడా సీఎం జగన్ గవర్నర్ తో చర్చించారని సమాచారం. 
 
గవర్నర్ తో సీఎం జగన్ తాజా రాజకీయాల గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. రాజ్ భవన్ వర్గాలు ముఖ్యమంత్రి దంపతులకు విందు ఏర్పాటు చేశాయి. ఏపీ సీఎం జగన్ గవర్నర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్నిరోజుల క్రితం ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కొందరు వరుసగా గవర్నర్ ను కలిశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇసుక కొరత గురించి, తెలుగుదేశం పార్టీ నేతలు శాంతిభద్రతల అంశం గురించి గవర్నర్ ను కలిశారు. 
 
డిసెంబర్ నెల మొదటివారంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలయ్యే అవకాశం ఉందని జగన్ గవర్నర్ తో ఈ సమావేశాల గురించి కూడా చర్చించారని తెలుస్తోంది. దాదాపు 45నిమిషాల పాటు ఈ భేటీ జరిగిందని సమాచారం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పోలవరానికి కేంద్రం నుండి రావాల్సిన బకాయిలు, రాజధాని గురించి సీఎం గవర్నర్ కు వివరించినట్లు తెలుస్తోంది. చాలా రోజుల తరువాత సీఎం జగన్ గవర్నర్ ను కలిశారు. నిన్న సీఎం జగన్ గవర్నర్ అపాయింట్ మెంట్ తీసుకున్నారు. 
 
రాష్ట్రంలో ఇసుక కొరతను నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా జగన్ గవర్నర్ కు వివరించారని సమాచారం. ఈరోజు సీఎం జగన్  ఇసుక అక్రమ రవాణాను నిరోధించటానికి టోల్ ఫ్రీ నంబర్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. విభిన్న అంశాలపై సీఎం జగన్, గవర్నర్ మధ్య చర్చలు జరిగాయి. గవర్నర్ ఇచ్చిన విందు స్వీకరించిన అనంతరం జగన్ దంపతులు రాజ్ భవన్ నుండి క్యాంప్  కార్యాలయానికి వెళ్లారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: