తెలుగోడిని పాక్ అరెస్ట్ చేసింది. త‌మ దేశంలోకి అక్ర‌మంగా అడుగుపెడుతున్నాడ‌నే అభియోగం మోపింది. పాకిస్థాన్‌లోకి అక్రమంగా ప్రవేశించారన్న ఆరోపణలతో ఆ దేశ అధికారులు సోమవారం ఇద్దరు భారతీయులను అరెస్టు చేశారు. వీరిలో ఒకరిని ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు చెందిన ప్రశాంత్‌గా గుర్తించారు. ఆయనతోపాటు మధ్యప్రదేశ్‌కు చెందిన దరీలాల్ అనే వ్యక్తిని కూడా పాక్ పోలీసులు అరెస్టుచేశారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గల బహావల్పూర్‌లో అరెస్టయిన ఈ ఇద్దరిలో ఒకరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని తెలుస్తున్నదని, పాక్‌లో ఉగ్రదాడి జరిపేందుకే అతడు వచ్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారని జియో న్యూస్ వార్తాసంస్థ వెల్లడించింది.

 

ప్రశాంత్ ప్రియురాలు స్విట్జర్లాండ్‌లో ఉంటున్నదని, ఆమెను కలుసుకోవాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి పాకిస్థాన్‌కు చేరుకొన్న ప్రశాంత్.. అక్కడి నుంచి యూరప్‌కు వెళ్లే ప్రయత్నంలో పాక్ పోలీసులకు పట్టుబడినట్టు తెలుస్తోంది. ప్రశాంత్‌ను పాక్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత అతను అక్కడి నుంచి స్వదేశంలోని తన తల్లిదండ్రులతో మాట్లాడినట్టు ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నది. మమ్మీ.. డాడీ బాగున్నారా? ఇక్కడ అంతా బాగానే ఉన్నది. ప్రాబ్లమ్ ఏమీ లేదని డిక్లేర్ అయిన తర్వాత నన్ను పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. ఇప్పుడు జైలుకు పంపిస్తారు. జైలు నుంచి ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ చేశాక బెయిల్ ప్రాసెస్ అవుతుంది. మ్యాగ్జిమమ్ వన్ మంత్‌లో రిలీజ్ అయిపోవచ్చు అని ప్రశాంత్ మాట్లాడినట్టు ఆ వీడియోలో ఉన్నది. 

 

 పాక్ పోలీసులు గతంలో కూడా ఇలాంటి అరెస్టులు చేశారు. డేరా ఘాజీ ఖాన్ పట్టణంలో రాజు లక్ష్మణ్ అనే భారత గూఢచారిని అరెస్టుచేసి తమ అత్యున్నత దర్యాప్తు సంస్థకు అప్పగించినట్టు పాక్ పోలీసులు ఆగస్టులో ప్రకటించారు. రాజు లక్ష్మణ్ బలూచిస్థాన్ రాష్ట్రం నుంచి డేరా ఘాజీ ఖాన్ పట్టణంలోకి ప్రవేశిస్తుండగా అరెస్టు చేశామని, భారత నౌకాదళ రిటైర్డ్ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను అరెస్టుచేసింది కూడా ఈ పట్టణంలోనేనని పాక్ పేర్కొన్నది.

 

కాగా, ఈ వీడియోపై సైబరాబాద్ పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈ వ్యవహారంపై శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్ మీడియాతో మాట్లాడుతూ ప్ర‌శాంత్ పంపిన‌ వీడియో రెండేళ్ల‌ క్రితంనాటిదని పేర్కొన్నారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేనందువల్లనే దేశం దాటివెళ్లాడని తెలిపారు. వైజాగ్‌లోని మిథులాపురి హుడా కాలనీకి చెందిన ప్రశాంత్ తన కుటుంబసభ్యులతో కలిసి కొన్నేళ్లు హైదరాబాద్ కూకట్‌పల్లి ఫేజ్-1లోని భగత్‌సింగ్ నగర్‌లో ఉన్నాడు. ఆయన తండ్రి మ్యాడం బాబూరావు (ప్రైవేట్ ఉద్యోగి) ప్రస్తుతం భగత్‌సింగ్‌నగర్‌లోనే నివసిస్తున్నారు. ప్రశాంత్ 2017లో అదృశ్యమైనట్టు అతని కుటుంబసభ్యులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: