తెలుగు రాజకీయాల్లో మరో సంచలనం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ నేను నిప్పు అంటూ మాట్లాడిన తెలుగుదేశం అధినేత ఇక ఏసీబీ విచారణ ఎదుర్కోబోతున్నారు. ఇన్నాళ్లూ కోర్టుల్లో స్టేలు తెచ్చుకుంటూ కోర్టు మెట్లెక్కకుండా జాగ్రత్త పడిన చంద్రబాబు ఇక కోర్టుకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన 14 ఏళ్ల క్రితం లక్ష్మీపార్వతి కేసు వేసిన సంగతి తెలిసిందే.

 

ఇప్పటి వరకూ ఈ కేసులో చంద్రబాబు హైకోర్టు నుంచి స్టే పొందారు. ఇప్పుడు ఆ స్టే కాలం తీరిపోవడంతో... ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది. దాదాపు 14 ఏళ్ల కిందటి కేసులో స్టే తొలగిపోవడంతో కేసును విచారణకు స్వీకరించింది.

 

చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని గతంలో నందమూరి లక్ష్మీపార్వతి చాన్నాళ్ల క్రితమే కేసు వేశారు. ఇలాంటి కేసుల నుంచి తప్పించుకోవడంలో సిద్ధహస్తుడని చంద్రబాబు గురించి విశ్లేషకులు చెబుతుంటారు. ఆయనపై అనేక కేసుల్లో స్టేలు వచ్చాయని అంటుంటారు. ఈ కేసుపై కూడా అప్పట్లో ఆయన హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు.

 

తాజాగా క్రిమినల్‌ కేసుల్లో ఆరు నెలలు దాటి ఉంటే స్టేలు తొలగినట్లేనని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చంద్రబాబుకు కష్టకాలం మొదలైందనే చెప్పాలి. చంద్రబాబు గతంలో తెచ్చుకున్న స్టే ఉత్తర్వులకు పొడిగింపు తీసుకోకపోవడంతో విచారణ చేపడుతున్నామని సోమవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది.

 

ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో లక్ష్మీపార్వతి వాంగ్మూలం కూడా నమోదు చేయనున్నారు. మరి ఈ కేసు విచారణ సందర్భంగా చంద్రబాబు కూడా జగన్ లాగానే కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. మరి దీన్నుంచి చంద్రబాబు మినహాయింపు కూడా కోరే అవకాశం లేకపోలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: