కొద్ది రోజుల క్రితమే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని.. సురేష్ అనే వ్యక్తి ఆమె ఆఫీసులోనే పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. విజయారెడ్డి హత్య జరిగిన రోజు నుండి ప్రభుత్వ అధికారులు తెగ భయపడిపోతున్నారు. ఆ దారుణ సంఘటన తర్వాత సామాన్య ప్రజలంతా తమ పనులు త్వరగా చేయకపోతే పెట్రోల్ పోసి చంపుతామని ఉద్యోగులని భయపెడుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు లంచం అనే మాట పలకడానికే జంకుతున్నారు. ఎందుకంటే లంచం అడిగితే ఎక్కడ పెట్రోల్ పోసి చంపుతారేమో అని.


పనులు త్వరగా చేయడం లేదని కక్షలకు పూనుకొని ఎవరు ఏ సమయంలో వచ్చి దాడి చేస్తారేమో అని భయంతో చాలా మంది రెవిన్యూ అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని వారి సొంత జిల్లాలకు బదిలీ చేయమని డిమాండ్ చేసారు. దాంతో వారి డిమాండ్ కి సానుకూలంగా స్పందిస్తూ కెసిఆర్ బదిలీ కార్యక్రమం చేపట్టారు. ఈ భయం ఏపీలో కూడా పెరుగుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మార్వో అధికారి ముందు జాగ్రత్తగా తన ఆఫీస్ ఎదుట ఒక తాడు కట్టుకోవడం తెలిసిన విషయమే. ప్రాణరక్షణ కోసం పలు పాట్లు పడుతున్నారు ఈ రెవెన్యూ ఉద్యోగులు. 


తాజాగా కరీంనగర్ కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ముందు జాగ్రత్తగా 'నేను లంచము తీసుకోను' అని పెద్ద అక్షరాలతో రాసి ఉన్న బోర్డుని తన ఆఫీసులో పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ ప్రభుత్వ ఉద్యోగి పేరు పోడేటి అశోక్.. కరీంనగర్ ఎలక్ట్రిసిటీ సర్కిల్ ఆఫీసులో కమర్షియల్ ఏడీఈగా పని చేస్తున్నాడు. అందరూ నిజాయితీగా పనిచేస్తే అవినీతి వ్యవస్థను పూర్తిగా నిర్ములించవచ్చు అని ఏడీఈ అశోక్ తెలిపారు. ఎట్టకేలకు విజయ రెడ్డి హత్య అనంతరం లంచం తీసుకోను అనే బోర్డులు పెట్టుకొనే పరిస్థితి వచ్చిందంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: