నమ్మి అధికారం కట్టబెట్టిన ప్రజల నమ్మకాలను సీఎం జగన్ వమ్ము చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ పరిపాలనా తీరుపై ఆయన మండిపడ్డారు. అసమర్థ ప్రభుత్వం కారణంగా పోలవరం పనులు ఆగిపోయాయని సంబంధిత మంత్రి పత్తా లేకుండా పోయాడని ఆరోపించారు. రాష్ట్ర సమస్యల గురించి ప్రజలకు సీఎం సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని ముంచడానికే ప్రజలను అధికారం అడిగారా?.. అని ప్రశ్నించారు.

 

 

పాలనలో వైఫల్యం చెంది మునిగిపోతున్న జగన్ ప్రభుత్వాన్ని కాపాడటానికి ఏ ధర్మాడి సత్యం లేడని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. పోలవరం పనులు ఎందుకు నత్తనడకన జరుగుతున్నాయో ప్రజలకు చెప్పాలన్నారు. ఇష్టారాజ్యాంగా కాంట్రాక్ట్ ఏజెన్సీలను మారిస్తే పోలవరం ప్రాజెక్టు భద్రత ఎవరిదని పీఏసీ ప్రశ్నించిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం ఖర్చు చేసిన డబ్బును కేంద్రం రీయింబర్స్ చేయడానికి జగన్ ప్రభుత్వం ఐదు నెలలుగా ఎందుకు ప్రయత్నించ లేదని ఉమ ప్రశ్నించారు. 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రజలకేం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడం మీ నిర్వాకం కాదా? అని ప్రశ్నించారు. పోలవరంలో వేల కోట్లు అవినీతి జరిగిందని మీ బంధువు పీటర్‍తో తప్పుడు రిపోర్ట్ ఇప్పించి ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. 

 

 

టీడీపీపై బురద జల్లేందుకే పనులు ఆపేసి తప్పుడు రిపోర్టు ఇచ్చారని.. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులే ముందుకు కదలడంలేదని విమర్శలు గుప్పించారు. పవర్ ప్రాజెక్టు కొట్టేయాలన్నదే మీ ఉద్ధేశంగా అనిపిస్తోందని ఆరోపణలు చేశారు. పోలవరాన్ని 70 శాతం పూర్తి చేసిన నవయుగ వాళ్లను జగన్ కాదన్నారని అన్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ పేరుతో అకారణంగా బందర్ పోర్టు రద్దు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రభుత్వ పోకడలను తప్పుబట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: