ఆర్టీసీ రూట్ల ప్రైవేటుపై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. రూట్ల ప్రైవేటుపై కేబినేట్ నిర్ణయం తప్పెలా అవుతుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈరోజు హైకోర్టులో ఆర్టీసీ కార్మికుల రెండు విషయాలకు సంబంధించిన విచారణ జరుగుతోంది. 5,100 ప్రైవేట్ బస్సులు కొత్తగా ఆర్టీసీ కార్పొరేషన్ లోకి తీసుకోవటానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. కేబినేట్ ఆమోదంను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ గురించి ఈరోజు విచారణ జరిగింది. 
 
హైకోర్టులో పిటిషనర్ తరపున వాదనలు ఎక్కువ సమయం జరిగాయి. ప్రభుత్వం కొత్త బస్సులను తీసుకొనివస్తే ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ కార్మికులకు సమస్యలు ఎదురవుతాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సమయంలో ఆర్టీసీలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయటానికి వీలు లేదని కానీ ప్రభుత్వం 5,100 బస్సులను ఆర్టీసీలోకి తీసుకోవటానికి తీసుకున్న నిర్ణయానికి చట్టబద్ధత లేదని పిటిషనర్ చెప్పారు. 
 
ఏ కార్పొరేషన్ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని పత్రికా ప్రకటన ఇవ్వాలని అభ్యంతరాలు ఉంటే 30 రోజుల సమయం ఇచ్చి ప్రైవేట్ బస్సులకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్ వాదనలు వినిపించగా కోర్టు గ్లోబలైజేషన్ లో భాగంగా చాలా మార్పులు వస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పెరుగుతోందని రవాణాకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని వ్యాఖ్యలు చేసింది. 
 
ఆర్టీసీ, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. సీఎం ఏం చెప్పినా న్యాయస్థానానికి అవసరం లేదని కోర్టు పేర్కొంది. గతంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ మాత్రమే దేశంలో ఉండేదని ఆ తరువాత చాలా ప్రైవేటు ఎయిర్ లైన్స్ విజయవంతం అయ్యాయని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఆ తరువాత హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: