టీడీపీ అంటే నందమూరి...నందమూరి అంటే టీడీపీ. ఇది ఎప్పుడు అభిమానుల మదిలో ఉండే మాట. కానీ చరిత్రని చూస్తే నందమూరి ఫ్యామిలీకి టీడీపీ అసలు కలిసిరాలేదనే అర్ధమవుతుంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నుంచి ఈ విషయం క్లియర్ గా తెలుస్తోంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమంటూ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే రామారావు అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆయన విజయం ఎక్కువసేపు నిలవకుండా నాదెండ్ల భాస్కరావు అడ్డుపడ్డారు. ఎన్టీఆర్ అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్ళినప్పుడు నాదెండ్ల సీఎం పీఠాన్ని లాగేసుకున్నారు.

 

దీంతో ఎన్టీఆర్ మళ్ళీ తిరిగొచ్చాకా ప్రజల్లోకి వచ్చారు. అప్పుడు సీఎం పీఠం దక్కిన ఎన్టీఆర్ మాత్రం అసెంబ్లీని రద్దు చేసి 1985లో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి అఖండ మెజారిటితో గెలిచారు. ఇక నాలుగేళ్ళు పాలన చేశాక 1989లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఘోరంగా ఓడిపోయారు. తర్వాత మళ్ళీ ప్రజల మధ్యలోకి పోరాటాలు చేసి 1994లో అధికారంలోకి వచ్చారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్న కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఎన్టీఆర్ ని గద్దె దించి 1995లో చంద్రబాబు సీఎం పీఠం దక్కించుకున్నారు. ఇక తర్వాత ఏడాది అనారోగ్యం పాలైన ఎన్టీఆర్ కన్నుమూశారు. ఈ విధంగా పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ కే టీడీపీ కలిసి రాలేదు.

 

ఇక తర్వాత ఎన్టీఆర్ రెండో భార్యగా ఉన్న లక్ష్మీపార్వతికి టీడీపీ కలిసి రాలేదు. బాబు ఆమెని పార్టీ నుంచే బహిష్కరించారు. తర్వాత ఆమె ‘అన్న టీడీపీ’ పార్టీ పెట్టి దాన్ని మూసేశారు. ప్రస్తుతం ఆమె వైసీపీలో కొనసాగుతున్నారు. అలాగే ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ కూడా మొదట టీడీపీలో ఉన్న తర్వాత...లక్ష్మీపార్వతి వెనుక నడిచి, చివరికి టీడీపీలో రాజ్యసభ సభ్యుడుగా ఉండి, ప్రత్యేక హోదా ఉద్యమంలో దానికి కూడా రాజీనామా చేసేసి, చివరికి రాజకీయాలకు దూరంగా ఉంటూనే ప్రమాదంలో కన్ను మూశారు.

 

అలాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా 2009లో ప్రచారం చేశాక, పార్టీలో అడ్రెస్ లేకుండా వెళ్లిపోయారు. అటు నందమూరి సుహాసిని కూడా 2018 తెలంగాణ ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి దారుణ ఓటమిని చవిచూశారు. అయితే నందమూరి ఫ్యామిలీలో బాలయ్య ఒక్కడే కొంచెం నిలబడ్డారు. ఆయన రెండుసార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్న ఆయన పార్టీలో పెద్దగా ఏం కనపడరు. కాబట్టి టీడీపీలో బాలయ్య పాత్ర నామమాత్రమే. ఏదేమైనా టీడీపీ నందమూరి ఫ్యామిలీకి కలిసిరాలేదని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: