ప్రశ్నిస్తానని జనసేన పేరిట పార్టీ...2014 ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు తెలిపి, ఆ తర్వాత విడిపోయి, 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఓటమి పాలైన పవన్ కల్యాణ్ క్రేజ్ తగ్గలేదు. ఆ క్రేజ్ తోనే ఇంకా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. కాకపోతే పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు జనసేన జర్నీని చూస్తే.... పార్టీలో పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షోనే కొనసాగింది.

 

ఆయన తప్ప మరో పేరున్న నాయకుడే పార్టీలో పెద్దగా కనపడటం లేదు. ఒకవేళ అలాంటి నేతలు ఉన్న వారు బయటకు అంతలా హైలైట్ కావడం లేదు. దీనికి కారణం పవన్ సినీ గ్లామర్ నే కారణంగా తెలుస్తోంది. పైగా ఒక్కడే పార్టీని భుజాల మీద వేసుకుని నడిపిస్తున్నారు. అయితే ఈ విధంగానే పవన్ ముందుకు వెళితే పార్టీని నడిపించడం కష్టం.

 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనలో పవన్ కల్యాణ్ తర్వాత కొద్దోగొప్పో చెప్పుకోదగిన నేతలో నాదెండ్ల మనోహర్, జేడీ లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ లు ఉన్నారు. కానీ వీరికి రాజకీయంగా అంత స్కోప్ రావడం లేదు. ఎక్కడ చూసిన పార్టీలో పవన్ మాత్రమే కనిపిస్తున్నారు. ఏ విషయంలోనైనా ఆయనే మొదట రియాక్ట్ అవుతున్నారు. కానీ టీడీపీ, వైసీపీల్లో ఇలా ఉండదు.

 

మొదట నేతలు ఏ విషయంలోనైనా మాట్లాడటంలో ముందుంటారు. చివరికి అధినేతలు ఎంటర్ అవుతారు. కానీ జనసేనలో ఏ చిన్న విషయమైనా పవనే చెప్పాల్సి వస్తుంది. ఆఖరికి ప్రత్యర్ధ పార్టీలు ఏమన్నా విమర్శలు చేసిన డైరెక్ట్ గా పవన్ వచ్చే కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది. మిగతా నేతలు రియాక్ట్ అయిన పెద్దగా హైలైట్ అవడం లేదు. పవన్ కౌంటర్ ఇస్తేనే అది తెలుస్తోంది.

 

అయితే పార్టీలో పరిస్తితి ఇలాగే కొనసాగితే కొన్ని రోజుల్లోనే ఇబ్బందులు మొదలవ్వడం ఖాయం. ఇప్పటికైనా పవన్ టీడీపీ, వైసీపీలకు ధీటైనా నాయకులని తయారుచేస్తేనే రాజకీయాల్లో నిలబడగలుగుతారు. లేదంటే అంతే సంగతులు.

మరింత సమాచారం తెలుసుకోండి: