తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కం రైతుబంధుకు ఊహించ‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. రైతులకు పెట్టుబడి కింద 10 వేలు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ధన్యవాదాలు తెలిపారు. లోక్‌ సభలో ఆయన తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని మెచ్చుకున్నారు. కేంద్రం ఏడాదికి 6 వేలు మాత్రమే ఇస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు 10  వేలు ఇస్తుందన్నారు కేంద్రం అందించే ప్రోత్సాహకం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతోందని తెలిపారు.

 

గతంలో రెండు పంటలకు కలిపి రూ.8 వేలు ఉన్న సహాయాన్ని 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రూ.2 వేలు పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఖరీఫ్, రబీ పంటలకు సంబంధించి రైతులకు ఎకరాకు రూ.10 వేలు చెల్లించారు. దీంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రైతులు తమ వ్యవసాయ పంట క్షేత్రాల్లో పంటల సాగుకు పెట్టుబడి కోసం గతంలో బ్యాంకుల ముందు నిరీక్షించాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న పెట్టుబడి సాయంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారు. గతంలో బ్యాంకు అధికారులు రుణాల కోసం సవాలక్ష నిబంధనలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేసేవారు. ప్రభుత్వం రైతుబంధు పథకం కింద అందిస్తున్న పెట్టుబడి సాయంతో రైతులకు ఆ ఇబ్బందులన్నీ తప్పినట్లయింది. వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న అప్పు రైతులకు భారంగా మారి ఆత్మహత్యలు చేసుకునేవారు. వ్యాపారుల వడ్డీ కిందకే పండించిన పంట ఇవ్వాల్సి వచ్చేది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేసి సాయం చేసింది.

 

గతేడాది ఖరీఫ్‌ నుంచి రైతుబంధు చెక్కుల పంపిణీ చేపట్టారు. కొంతమంది భూస్వాములు, విదేశాల్లో ఉన్న వారు చెక్కులు తీసుకోలేదు. రెవెన్యూ రికార్డుల్లో తలెత్తిన గందరగోళంతో పలువురు చెక్కులు వచ్చినా తక్కువ భూమికి వచ్చాయని తీసుకోలేదు. దీంతో భారీగా చెక్కులు మిగిలిపోయాయి. యాసంగి సమయంలో ఎన్నికల కోడ్‌ వల్ల చెక్కుల పంపిణీపై ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేయాలని ఆదేశించింది. దీంతో వ్యవసాయశాఖ ముద్రించిన చెక్కులను పక్కన పెట్టి రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేసింది. అయితే ఇతర దేశాలు, పట్టణాల్లో ఉన్న వారు బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వకపోవడంతో వారికి పెట్టుబడి సాయం అందలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: