విజయవాడలో గతంలో కాల్ మనీ వ్యవహారం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఉదంతం రాజకీయంగానూ ఓ ఊపు ఊపింది. ఆ తర్వాత పోలీసులు ఈ సమస్యపై దృష్టి సారించినట్టు కనిపించినా ఇంకా..అలాంటి కామరూప రాక్షసులు కనిపిస్తూనే ఉన్నారు. మహిళలను కాల్చుకుతింటూనే ఉన్నారు.

 

వీరు కూలీ,నాలీ చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకునే వారినే కాదు.. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులను సైతం బెదిరిస్తున్నారు. గుంటూరు జిల్లాలో తాజాగా ఇలాంటి బాగోతం వెలుగు చూసింది. కుమారుడి చదువు కోసం తెలిసిన వ్యక్తుల దగ్గర డబ్బులు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించినప్పటికీ ఓ ప్రభుత్వ ఉద్యోగిని కాల్ మనీ రాక్షసులు బెదిరించారట. అప్పు తీర్చావు సరే.. మా కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధిస్తున్నారని ఆ ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది.

 

గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ‘స్పందన’లో ఫిర్యాదు చేసి.. వెంటనే తాను తెచ్చుకున్న , నిద్రమాత్రలు మింగేసింది. దీంతో ఆమెను గుంటూరులోని జీజీహెచ్‌కు తరలించారు. బాధితురాలు వాదన ఇలా ఉంది. కుమారుడి చదువుల కోసం నరసరావుపేటకు చెందిన ఇద్దరు ఫైనాన్షియర్ల దగ్గర ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేసి బాధితురాలు రూ.3 లక్షలు అప్పుగా తీసుకుంది. దీని కోసం ప్రతి నెలా రూ.15 వేలు చెల్లిస్తోంది.

 

ఆ తర్వాత వారు ఇంటికి వచ్చి ఏటీఎం కార్డు తీసుకెళ్లారు. అప్పు తీరాక ఏటీఎం కార్డు ఇస్తామంటూ ప్రతి నెలా రూ.30 వేలు చొప్పున రెండున్నర సంవత్సరాలు డబ్బు తీసుకున్నారు. అంటే 3 లక్షల రూపాయల అప్పుకు అసలు మొత్తం కలిపి 8 లక్షలు వసూలు చేశారన్నమాట. ఆదేమని నిలదీస్తే.. బాధితురాలిపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారట.

 

అంతే కాదు.. అప్పు తీరిస్తే సరిపోదని తమ కోరికనూ తీర్చాలంటూ రాత్రి వేళల్లో ఫోన్‌ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారట. దీంతో ఆ ఉద్యోగిని వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెబుతోంది. తనను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తోంది. తనకు అప్పు ఇచ్చిన వారి దగ్గర ఉన్న ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఏటీఎం కార్డు ఇప్పించాలని బాధితురాలు పోలీసులను వేడుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: