ఏపీ సర్కారు వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియంను రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ అమలు చేయదలచింది. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం అనేది ఉండదు. ఈ అంశంపై ప్రతిపక్షాలు రోజూ గోల చేస్తున్నాయి. ఇంగ్లీష్ ను వ్యతిరేకించకపోయినా .. తెలుగు మీడియం ను కూడా కొనసాగించాలని సూచిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో పట్టువిడవటం లేదు.

 

ఇలాంటి హాట్ పొలిటికల్ సీన్ ఉన్న నేపథ్యంలో.. నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంటులో తెలుగు భాష గురించి మాట్లాడటం వివాదాస్పదం అయ్యింది. ఆయనపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడినట్టు తెలుస్తోంది. ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడారని సీఎం భావిస్తున్నారు. అందుకే ఆయన పట్ల సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ విషయంలో విషయంలో ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు.

 

పేద పిల్లల అభ్యున్నతి, భవిష్యత్తు కోసం పెడుతున్న ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పేదల శ్రేయస్సును అడ్డుకున్నట్లేనని జగన్ భావిస్తున్నారు. అందుకే పార్లమెంట్‌ సమావేశాల్లో రఘురామకృష్ణంరాజు వ్యవహరించిన తీరుపై జిల్లా ఇన్‌ఛార్జి వైవీ సుబ్బారెడ్డితో జగన్ చర్చించారు. రఘురామకృష్ణంరాజుకు క్లాస్ పీకాలని సుబ్బారెడ్డికి సూచించినట్టు తెలుస్తోంది.

 

అయితే.. లోక్ సభ సమావేశాల సందర్భంగా మాట్లాడిన రఘురామకృష్ణంరాజు.. షెడ్యూల్ 10లో ఉన్న తెలుగు అకాడమీని విభజించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుభాష అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లు గడుస్తున్నా తెలుగు అకాడమీని అలాగే ఉంచారని.... ఇప్పటి వరకు ఏపీలో అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదని ఆయన గుర్తు చేశారు.

 

తాను కేవలం తెలుగును అభివృద్ధి చేయమని మాత్రమే చెప్పానని.. ఇంగ్లీష్ ను వ్యతిరేకించలేదని ఎంపీ అంటున్నారు. తన వాదనను జగన్ కు వివరిస్తానని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: