గతంతో పోలిస్తే ఇప్పుడు జనసేన పార్టీలో స్పీడు పెరిగింది. అధికార పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేయడంలో పవన్ బాగానే సక్సెస్ అవుతున్నాడు. ఒకరకంగా ప్రతిపక్ష తెలుగుదేశం కంటే జనసేన ఇప్పుడు ప్రతిపక్ష పాత్రల్లో సమర్థవంతంగా రాజకీయం చేస్తోంది. పవన్  రెండు రోజుల పోరాటం ఐదు రోజులు విశ్రాంతి అన్న విమర్శ నుంచి బాగానే తప్పించుకున్నాడు. నిత్యం ఏదో ఒక సమస్య మీద పోరాటం చేస్తూ ప్రజల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎన్నికల్లో తాను రెండు చోట్లా ఓటమి చెందడంతో పాటు ఒక్క చోట మాత్రమే గెలవడం మిగతా చోట్ల అవమానకరమైన రీతిలో ఓట్లు సాధించడం పవన్ లో ఎక్కడలేని నిరాశను కలిగించింది. అయితే దాని నుంచి తొందరగానే బయటపడి యాక్టివ్ అయ్యారు పవన్. కానీ పవన్ ఇప్పుడు చేస్తున్న రాజకీయం ఆయనపై నమ్మకం పెంచకపోగా అనేక అనుమానాలకు తావిస్తోంది. 

 

టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా, అధికార పార్టీని ఉద్దేశించి పవన్ పెద్దగా విమర్శలు చేసేవారు కాదు. ఏదో అప్పుడప్పుడు తన ఉనికిని చాటుకోవాలని అన్నట్టుగా వ్యవహరించేవారు. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా జగన్ ను టార్గెట్ చేసుకుంటూ, ప్రతిపక్షాన్ని సమర్థవంతంగా నడిపించడంలో జగన్ విఫలమయ్యారని ఎద్దేవా చేసేవారు. ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది . ఇప్పుడు కూడా పవన్ ప్రతిపక్ష పార్టీ టిడిపి జోలికి వెళ్లకుండా, వైసీపీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నాడు. పవన్ చేసే పోరాటాలకు టిడిపి మద్దతు తీసుకుంటున్నాడు. అలాగే టిడిపి పోరాటాలకు పవన్ మద్దతు తెలుపుతూ టీడీపీకి అనుబంధంగా జనసేన ఉంది అన్నట్టుగా జనాల్లో అనుమానాలు పెంచుతున్నాడు. 

 

పవన్ అంటే చంద్రబాబు కనుసన్నల్లో పని చేసే వ్యక్తి గా ఇప్పటికీ ఆ ముద్ర తొలిగించుకోలేకపోయాడు. టిడిపి ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పవన్ ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు తరఫున కేంద్ర పెద్దలతో మాట్లాడేందుకు ప్రయత్నించారనే వార్తలు కూడా వచ్చాయి. ఇది టీడీపీ జనసేన రహస్య పొత్తులో భాగంగానే జరిగింది అనే అనుమానాలు అందరిలోనూ పెరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ బుర్ర నిండా చంద్రబాబు నిండి పోయారని మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జనసేన లో కలవరం పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న చాలామంది పవన్ పై నమ్మకం కోల్పోయారు. వారికి ప్రత్యామ్నాయం కనిపించక వేచి చూసే ధోరణిలో జనసేన లో కొనసాగుతున్నారు. పవన్ కూడా పార్టీలో నాదెండ్ల మనోహర్ కు తప్ప మిగతా వారిని ఎవరిని పెద్దగా పట్టించుకోకపోవడం, ఆ పార్టీల నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుంది. జనసేన కోసం తాము వ్యక్తిగతంగా, ఆర్థికంగా చాలా నష్టపోయామని అయినా తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని బాధ జనసేన నాయకుల్లో బాగా ఉంది. అయినా వారు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. 

 

పవన్ రాజకీయంగా బలపడి బలం పెంచుకోవాలంటే తెలుగుదేశం పార్టీని దూరం పెట్టి, జనసేన టిడిపి ఒకే తానులో ముక్కలు  అనే అభిప్రాయం నుంచి జనాలు బయటపడేలా వ్యవహరించాలి. పార్టీ పుంజుకోవడానికి కాస్త సమయం పట్టినా పవన్ స్వతంత్రంగానే వ్యవహరిస్తూ, పార్టీని క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకువెళ్లగలిగితే మరింత  బలం పుంజుకుని వచ్చే ఎన్నికలనాటికైనా మెరుగైన ఫలితాలు సాధించే పరిస్థితి ఉంటుంది. అలా కాదని టిడిపితో అంటకాగుతూ ముందుకు వెళితే మళ్ళీ 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఈ విషయం పవన్ గుర్తుపెట్టుకుని తమ పార్టీపై పడిన టిడిపి ముద్రను తొందరగా చెరిపేసుకోగలిగితే జనసేన రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: