గన్నవరం పొలిటికల్‌ టెన్షన్‌ ఇంకా అలానే ఉంది. వైసీపీలో చేరతానని వంశీ చెబుతున్నా... అది ఎప్పుడనేది ఇంకా తేలలేదు. మరోవైపు పార్టీ ఇన్ ఛార్జ్ యార్లగడ్డ కూడా నియోజక వర్గం అభివృద్ధి పైనే దృష్టి పెడతానని తేల్చారు. సీఎం జగన్‌ వద్దకు పంచాయతీ వెళ్లినా... వంశీ చేరికపై క్లారిటీ రాకపోవడంతో చర్చనీయాంశం అయింది. 

 

ఎన్నికలకు ముందు, తర్వాత కూడా గన్నవరంలో పరిణామాలు వైసీపీ వర్సెస్‌ టీడీపీగా మారాయి.  ఎన్నికలకు ముందు దాడుల వరకు వెళ్లిన వ్యవహారం...  పోలింగ్‌ సమయంలోనూ కొనసాగింది. స్వల్ప తేడాతో ఎమ్మెల్యేగా గెలుపొందిన వంశీ... నాలుగు నెలల తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పారు. అయితే ఆయన వైసీపీలో చేరతానంటూ జగన్ ను కలవటంతో వ్యవహారం మరింత వేడెక్కింది. ఎన్నికల సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉప్పు నిప్పులా ఉంటే వారందరూ కలిసి ఎలా పనిచేస్తారనే చర్చ మొదలైంది. అయితే వంశీ జగన్‌ను కలిసినా పార్టీలో చేరికపై స్పష్టత మాత్రం రాలేదు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావటంతో దానికి సమయం పట్టే అవకాశాలు ఉన్నాయనేది ఆయన వర్గీయుల మాట. 

 

మరోవైపు గన్నవరం వైసీపీ ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు జగన్‌తో సమావేశయ్యారు. అయితే ఈ భేటీలో అసలు వంశీ ప్రస్థావనే రాలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇదంతా తమకు పాజిటివ్‌గా ఉందనేది వారి మాట. అయితే యార్లగడ్డ మాత్రం నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి పెడతానంటున్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ మీద వైసీపీ బ్రాండ్ పడడంతో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన తప్పని పరిస్థితి అధికారులకు వచ్చింది. దీన్ని యార్లగడ్డ అనుచరులు ఏవిధంగా భావిస్తారనేది చూడాలి. అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో తమ తమ అనుచరులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో స్థానికంగా వైసీపీకి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వంశీ వైసీపీ కండువా కప్పుకునే పరిస్థితే వస్తే యార్లగడ్డ భవితవ్యం ఏంటనే చర్చ కూడా సాగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: