చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టినా, సమీక్షలు నిర్వహించిన గంటలు తరబడి చెప్పిందే చెప్పి వినే వారికీ చుక్కలు కనిపించేవి. కొండను తవ్వి ఎలుకను తీసే రకమని బాబు గురించి ఎవరైనా చెబుతారు. ఇక పార్టీ సమావేశంలో బాబు మైక్ నందుకుంటే కార్యకర్తలు నేతలు కూడా బెదిరిపోయేవారు.. గంటల తరబడి.. చెప్పిందే చెప్పి.. పాడిందే పాడరా అన్నట్టు ఆయన స్పీచులు సాగేవన్న సెటైర్లు రాజకీయవర్గాల్లో ఉన్నాయి.ఇక చంద్రబాబు ఎంత సేపు మాట్లాడితే అంత సేపు లైవులు ఇచ్చేవి ఆయన అనుకూల పచ్చమీడియా చానెళ్లు.. బాబు చెప్పే బోరింగ్ విషయాలు వినలేక చాలా మంది టీవీ కట్టేసేవాళ్లు. ఇక కలెక్టర్ల మీటింగ్ లూ అంతే.. ఎప్పుడో పొద్దున మొదలుపెడితే రాత్రి 12 గంటల వరకూ సాగేది. సద్ది తెచ్చుకొని తిని బాబుగారి ఉపన్యాసాలు వినలేక కలెక్టర్లు పడే ఆపసోపాల గురించి కథలు కథలుగా చెబుతారు..

అయితే ఓటమి ఎవరినైనా మార్చేస్తుంది అంటారు. ఇప్పుడు చంద్రబాబును చూస్తే నిజమని చెప్పాలి. 2019లో ఓడిపోయాక చంద్రబాబు పూర్తిగా మారిపోయారు. ఇప్పుడు ఈ విషయాన్ని టీడీపీ నేతలు కార్యకర్తలే ఘంఠాపథంగా అంగీకరిస్తున్న వాస్తవం. చంద్రబాబులో వచ్చిన మార్పు ఏంటో తెలిసా.. సూటిగా.. సుత్తిలేకుండా క్లుప్తంగా విషయాన్ని చెప్పేస్తున్నారట.. ఇలా బాబులో వచ్చిన భారీ మార్పు చూసి ఇప్పుడు ఈయన సమావేశాలకు హాజరవుతున్న నేతలు తెగ సంబరపడిపోతూ ‘మా బాబు బంగారం’ అని ముచ్చటపడుతున్నారు..

పార్టీ ఓటమి నేపథ్యంలో నాయకుడు మాట్లాడే విధానం మారాలని బాబు గారు గ్రహించినట్టున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం.. ప్రతిపక్షంలోకి వచ్చాక దిగ్గజ నేతలంతా వలస బాటపడుతుండడంతో పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల బాటపట్టారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో మూడు రోజుల పాటు సమీక్షించి నేతలకు ధైర్యం నూరిపోసిన బాబు.. తాజాగా టీడీపీకి ఒకప్పుడు బలమైన కంచుకోటైన పశ్చిమగోదావరిలో మూడు రోజుల సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ సమావేశాల్లో బాబులో వచ్చిన మార్పును నేతలు కొట్టొచ్చినట్టు గమనిస్తున్నారు. గంటలు గంటలు ఊదరగొట్టే ప్రసంగాలు బాబు చేయడం లేదట.. సూటిగా సుత్తి లేకుండా క్లుప్తంగా ఉన్న విషయాన్ని కేవలం 10 నిమిషాల్లోనే కన్వే చేస్తున్నారట

మరింత సమాచారం తెలుసుకోండి: