తెలంగాణ‌లో 47 రోజులుగా జ‌రుగుతున్న ఆర్టీసీ స‌మ్మెలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసుకున్న ఆర్టీసీ జేఏసీ సమ్మెపై విచారణ చేపట్టాలని హైకోర్ట్ లేబర్ కోర్టుకు ట్రాన్సఫర్ చేయ‌డాన్ని తాము గౌరవిస్తున్నామ‌ని...సెప్టెంబర్ 4 ముందు ఉన్న పరిస్థితులు ఆర్టీసీలో ఉంటే వెంటనే తాము సమ్మెను విరమిస్తామని ప్ర‌క‌టించారు. కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఎలాంటి షరతులు లేకుండా కార్మికుల్ని విధ‌ల్లోకి తీసుకోవాలని కోరుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్  అశ్వత్థామరెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దీనిపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తార‌నే ఆస‌క్తి నెల‌కొన్న త‌రుణంలో...జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించినందున వారి వినతిని మన్నించి కార్మికులపై సానుభూతితో ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని ప‌వ‌న్ కోరారు. ఈ మేర‌కు ఆయ‌న‌కు ట్విట్ట‌ర్ ద్వారా విజ్ఞ‌ప్తి చేశారు. 

``పెద్దలు, గౌర‌వ‌నీయులైన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి, తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించినందున వారి వినతిని మన్నించి కార్మికులపై సానుభూతితో ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా మా ప్రతినిధుల ద్వారా కార్మిక సంఘాల నాయకులూ కోరారు. నలభై రోజులకిపైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రి తగిన భరోసా ఇస్తారని ఆశిస్తున్నాను. తద్వారా ప్రజా రవాణా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఆపై సానుకూలంగా వారి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను.
- పవన్ కళ్యాణ్ అధ్యక్షులు, జనసేన పార్టీ`` అని ప‌వ‌న్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై సీఎం కేసీఆర్ స్పంద‌న ఏ విధంగా ఉంటుందో వేచి  చూడాల్సిందే. 

 

కాగా, స‌మ్మె కొన‌సాగుతున్న స‌మ‌యంలో...ఆర్టీసీ కార్మికులు స‌మ్మెను ఆయా పార్టీల నేత‌ల‌కు వివ‌రించ‌డంలో భాగంగా, టీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు హైదరాబాద్ ప్రశాసన్ నగర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిశారు. 27 రోజులుగా జరుగుతున్న సమ్మె వివరాలను, తమ డిమాండ్లను వివరించారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించిందని, సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు. దీనికి స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌...సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరిన‌ప్ప‌టికీ...ఆయ‌న‌కు దొర‌క‌లేదు. తాజా ఉదంతంలో...ప‌వ‌న్ కోరిక‌పై కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: