ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారం కోల్పోయి  దాదాపు ఆరు నెలలు కావొస్తుంది. ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన తర్వాత నుంచి టీడీపీ పరిస్తితి దిగజారిపోయింది. ఈ ఆరు నెలల కాలంలో పార్టీ బలపడాల్సింది పోయి మరింత ఘోరంగా తయారైంది. అధినేత చంద్రబాబు పార్టీ కోసం కష్టపడ్డ నేతలు మాత్రం సహకరించడం లేదు. దానికి తోడు చాలామంది బాబుకు ఝలక్ ఇచ్చేసి వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. అయితే రాష్ట్రమంతా టీడీపీకి ఇదే పరిస్తితి ఉంది. రాష్ట్రంలోనే ఇలా ఉంటే సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఇంకా ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.

 

ప్రస్తుతానికి అక్కడ అసలు టీడీపీ ఉందా? అనే పరిస్తితి వచ్చింది. అయితే ఈ పరిస్థితిని పోగొట్టాలని అధినేత జిల్లా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఆయన జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆ మూడు రోజుల పాటు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేసి, నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.  ఎన్నికల ఫలితాల తర్వాత బాబు కడప జిల్లాకు వెళ్ళడం ఇదే తొలిసారి. సరిగా ఇదే సమయంలో బాబుకు కొందరు సీనియర్ నేతలు షాక్ ఇచ్చారు.

 

చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా అక్కడి నేతలు సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అధ్యక్షుడుగా వ్యవహరించారు. అయితే దీనికి చాలామంది సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, పాలకొండ్రాయుడు, సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీలు బీటెక్ రవి, శివనాథ రెడ్డిలు హాజరు కాలేదు. అయితే వీరు బిజీగా ఉండి హాజరుకాలేదా? లేదా పార్టీకి దూరంగా ఉండాలని హాజరు కాలేదా? అనే విషయం అర్ధం కావడం లేదు. ఏదేమైనా కడప టీడీపీ నేతలు బాబుకు హ్యాండ్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: