వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గట్టిగా కాలేదు.కానీ రివర్స్ లో వలసలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. వైసీపీకి చెందిన కొందరు ఎంపీలు గీత దాటుతారని ఊహాగానాలు వస్తున్న సంగతి విధితమే. ఈ నేపధ్యంలో ఢిల్లీలో ఈ రోజు జరిగిన ఓ సంఘటన ఏపీ రాజకీయ వర్గాల్లొ కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా వూహిస్తున్నట్లుగనే పరిణామాలు జరుగుతున్నాయా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి.

 

ఈ రోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రధాని మోడీ వెళ్తూ అక్కడే ఉన్న వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణంరాజుని పలకరించడం అందరినీ ఆకట్టుకుంది. ఏం రాజు గారు బాగున్నారా అంటూ మోడీ పలకరింపుతో రాజు గారు పులకరించిపోయారు. అయితే అదే సమయంలో  ఏపీలో ఇపుడు పెద్ద రాజకీయ దుమారం కూడా ఒక్క సారిగా రేగుతోంది. మోడీ ఆగి మరీ రాజు గారిని పలకరించడం అంటే ఏదో జరుగుతోందని అంతా అంటున్నారు.

 

ఇక రఘురామక్రిష్ణంరాజు 2014 లో బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తరువాత ఆయన టీడీపీలో చేరారు. ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన రాజు నర్సాపురం నుంచి జగన్ గాలిలో గెలిచారు. గెలిచిన వెంటనే ప్రధాని మోడీని కలసి అప్పట్లోనే సంచలనం రేపారు. ఇక అక్టోబర్ 10న ఆయన్ని  అత్యంత కీలకమైన సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ చైర్మన్ గా  నియమిస్తూ లోక్ సభ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేయడంతో నివ్వెర పోవడం  వైసీపీ అధినాయకత్వం వంతు అయింది.

 

కనీస సమాచారం లేకుండానే ఈ పదవిలో రఘురామక్రిష్ణంరాజును  కూర్చోబెట్టడం వెనక బీజేపీ మార్క్  రాజకీయం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక ఏపీలో  బీజేపీ బలపడాలని చూస్తోందని, అందులో భాగంగా పెద్ద సంఖ్యలో వైసీపీ ఎంపీలకు గేలం వేస్తోందని అంటున్నారు. అందుకు నిన్నటి వరకూ తమతో ఉన్న రఘురామక్రిష్ణంరాజును  ముందుకు తెస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే కేవలం రఘురామక్రిష్ణంరాజు ఒక్కరేనా, లేక మరెంతమంది ఎంపీలు గీత దాటుతారా అన్నది కూడా పెద్ద చర్చగా ఉంది. కనీసం అరడజన్ మంది వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరుతారని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఏది ఏమైనా మోడీ పలకరింపు ఇపుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: