గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరిక ఖాయమైన సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఇప్పటికే వైసీపీ నుంచి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నారు. వంశీ పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నప్పటి నుంచి ఆయనలో ఆందోళన మొదలైంది. అయితే ఈ వ్యవహారాన్ని జగన్ చాలా సింపుల్ గానే తేల్చిసినట్టు కనిపిస్తోంది.

 

ఇటీవల జగన్ ను కలిసిన యార్లగడ్డ వెంకట్రావు.. ఆ తర్వాత చాలా సంతృప్తిగా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నడుచుకుంటా. నేను వైయస్‌ జగన్‌కు విధేయుడిని, పార్టీ మారే మనిషిని కాదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లుగా కొన్ని పత్రికలు, కొన్ని చానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని ఎవరూ విశ్వసించొద్దన్నారు.

 

వైయస్‌ జగన్‌పై ఉన్న విశ్వాసంతో అమెరికా నుంచి ఆంధ్రరాష్ట్రానికి వచ్చానని, ఆయన ఆదేశాల మేరకు రాజకీయాల్లోకి వచ్చి.. పోటీ చేశానన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మూడవ రోజే తన గురించి ఆలోచించిన మహానాయకుడు వైయస్‌ జగన్‌ అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకముందే తనను పిలిచి మాట్లాడారన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సినిమా హీరోలకంటే క్రేజ్‌ ఉన్న నాయకుడు అని యార్లగడ్డ అన్నారు.

 

ముఖ్యమంత్రి తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని స్వాగతిస్తానని చెప్పారు. కార్యకర్తల వెన్నంటే ఉంటానని, సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌ అభిమానుల్లో తాను ఒకడినని చెప్పారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తానన్నారు. గన్నవరం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు. మొత్తానికి వైఎస్ జగన్ ఇద్దరి మధ్యా రాజీ బాగానే కుదిర్చినట్టు కనిపిస్తోంది కదా..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: