తెలంగాణ రాజ‌కీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌ది విభిన్న‌శైలి. ఇన్నేళ్లుగా కలిసి రాజకీయం చేసిన వారిద్ద‌రిదీ...ఇటీవ‌లి వరకు ఒకటే మాట. అయితే హ‌ఠాత్తుగా కాంగ్రెస్ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలిచిన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి సై అనేశారు. తమకు పీసీసీ పీఠం కావాలని...లేదంటే కాంగ్రెస్‌ను వీడుతామంటూ ఆయన ప్రకటనలు చేశారు. దీంతో తమ్ముడితో కాంగ్రెస్ అధిష్టానాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ఓ అంచనాకు వచ్చేసింది. దీంతోపాటుగా, కాంగ్రెస్ లో పీసీసీ పీఠం దక్కకపోతే బీజేపీలో చేరడానికి కోమటిరెడ్డి బ్రదర్స్ రెడీ అయ్యారని కాంగ్రెస్ అధిష్టానం అనుమానించింది. అందుకే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పీసీసీ అధ్యక్ష పదవికి దూరం పెట్టిందని అన్నారు.అయితే, త్వ‌ర‌లోనే పీసీసీ అధ్యక్షుడిని మార్చ‌బోతున్నార‌ని..ఆ రేసులో అందరికంటే తానే ముందున్నానని ఎంపీ కోమ‌టిరెడ్డి ప్ర‌క‌టించారు. 

 

తాజాగా ఓ మీడియా సంస్థ‌తో కోమ‌టిరెడ్డి మాట్లాడుతూ... పీసీసీ చీఫ్ మార్పు ఖాయ‌మైంద‌న్నారు. మహరాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీపీసీసీకి నూతన రథసారథి రాబోతున్నట్లు ప్ర‌క‌టించారు. పీసీసీ రేసులో అందరికంటే తానే ముందున్నానని పేర్కొంటూ.....ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు కూడా తనకే ఇస్తున్నారని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌ద‌వి ద‌క్కిన త‌ర్వాత‌..రాష్ట్రవ్యాప్తంగా పాద‌యాత్ర చేస్తాన‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

 

ఇదిలాఉండ‌గా, ఇప్ప‌టికే కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ నేత జ‌గ్గారెడ్డి కొత్త డీల్‌తో ముందుకు వ‌చ్చారు. తెలంగాణ‌లోని రైతుల‌కు స‌మ‌స్య‌లు లేకుండా చేస్తే..తాను ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు గుడి క‌ట్టిస్తాన‌ని ప్ర‌క‌టించిన ఆయ‌నే...తాజాగా త‌న‌ను పీసీసీ చీఫ్ చేయాల‌ని కాంగ్రెస్ పెద్ద‌ల‌కు విన్న‌వించారు. అలా చేస్తే...రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోన‌ని..పైగా పార్టీ ఎవ‌రిని చెప్తే..వారినే బ‌రిలో ఉంచుతాన‌ని ఆఫ‌ర్ ఇచ్చారు. గాంధీభ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ...జ‌గ్గారెడ్డి ఈ మేర‌కు వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ఇప్పటికే త‌న బయోడేటాను అధిష్టానానికి రిజిస్టర్ పోస్ట్ చేశానని తెలిపిన జ‌గ్గారెడ్డి త్వ‌ర‌లో  ఢిల్లీ వెళ్లి పీసీసీ పదవి కోసం అధిష్టానాన్ని అడుగుతాన‌ని ప్ర‌క‌టించారు.  ఇలా పీసీసీ ముఖ్య‌నేత‌లు కీల‌క ప‌ద‌విపై ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: