మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ సర్కారు నిర్ణయాలను తప్పుబడుతున్నారు. జగన్ నిర్ణయాలతో రాష్ట్రం అధోగతి పాలవుతోందంటున్నారు. ప్రత్యేకించి ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. సన్నద్ధత లేకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడతారా అని నిలదీస్తున్నారు. అయితే చంద్రబాబు తీరును వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు.

 

ప్రత్యేకించి తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి చంద్రబాబు తీరును ఎండగడుతున్నారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో నారాయణ, శ్రీచైతన్య పాఠశాలలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వానికి చెందిన 6 వేల పాఠశాలలను మూత వేయించారని ధ్వజమెత్తారు. ఇన్‌డైరెక్ట్‌గా నారాయణ, శ్రీచైతన్య పాఠశాలలను ప్రోత్సహించారని తెలిపారు. ఆ పాఠశాల్లో కనీస సౌకర్యాలు ఉన్నాయా అని ఏనాడు చంద్రబాబు ప్రశ్నించలేదన్నారు.

 

చంద్రబాబు తాపత్రయమంతా.. తన పార్టీ నాయకుడు మాజీ మంత్రి నారాయణ కోసం తప్ప పేద విద్యార్థుల కోసం కాదని ఆరోపించారు. సీఎం వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక చదువులకు పెద్దపీట వేశారన్నారు. అమ్మ ఒడి అనే గొప్ప పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. రాక్షస విద్య నుంచి కాపాడుతూ..ఫీజులను నియంత్రిస్తూ గొప్ప పాలన చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆంగ్ల మీడియం ఏర్పాటు చేస్తున్నామని, మొదటి ఏడాది 1వ తేదీ నుంచి 6వ తరగతి వరకు, ఆ తరువాత ఒక్కో సంవత్సరం ఒక్కో తరగతిని ఇంగ్లీష్‌ మీడియం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు.

 

తెలుగు భాష చదువుకుని ఇంట్లో ఉద్యోగం వస్తుందా అన్నారు. ఆంగ్లం మీడియాన్ని వ్యతిరేకించే వారు తమ పిల్లలను వేద పాఠశాలల్లో చేర్పించగలరా అని ప్రశ్నించారు. తెలుగు మీడియంలోనే అలాంటి వారికి విద్యాబోధన అందిస్తామన్నారు. రాయి వేయడానికి మాత్రమే ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. గతంలో చంద్రబాబు సీఎం హోదాలో ఉంటూ "నాకు వెంకయ్యనాయుడికి అవకాశం ఉంటే ఇక్కడ పుట్టాలని ఎందుకు కోరుకుంటామని, అమెరికాలో పుడతామని' చెప్పింది మరిచిపోయారా అన్నారు. ఇప్పుడేమో తెలుగుకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: