సుజనా చౌదరి.. ఓ వ్యాపారవేత్త.. రాజకీయ నాయకుడిగా మారిన వ్యాపార వేత్త. నిన్నటి వరకూ తెలుగుదేశంలో ఉండి..ఇటీవలే బీజేపీలో చేరారు. బీజేపీలో చేరినా ఆయన ఇంకా టీడీపీ నేతలాగానే మాట్లాడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా సుజనా చౌదరి వైసీపీ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. దీంతో వైసీపీ నేతలు ఆయన విమర్శలకు కౌంటర్లు ఇస్తున్నారు.

 

జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక మ‌త‌ప‌రంగా విభ‌జించి పార్టీ, ప్రభుత్వం మీద బుర‌ద‌ జ‌ల్లాల‌లని చూస్తున్నార‌ని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇంగ్లిష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడే సుజ‌నా చౌద‌రి పిల్లలు ఏ మీడియంలో చ‌దివార‌ని ప్రశ్నించారు. ఆయ‌న కేంద్ర మంత్రిగా ఉండ‌గా కేంద్రీయ విద్యాల‌య‌లో ఇంగ్లిష్ మీడియం ఎందుకు తీసేయ‌లేకపోయాడో చెప్పాలని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.

 

సుజనా చౌదరి చంద్రబాబు అజెండాతోనే బీజేపీలో కొన‌సాగుతున్నాడ‌ని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. పార్టీ మారిన నాటి నుంచి ఇప్పటి వ‌ర‌కు సుజ‌నా కాల్‌ డేటా బ‌య‌ట‌కు తీస్తే ఆయ‌న చీక‌టి రాజ‌కీయం వెలుగులోకి వ‌స్తుంద‌న్నారు. అస‌లు తాను ఎందుకు పార్టీ మారాల్సి వ‌చ్చిందో కూడా ఎవ‌రికీ చెప్పక‌ పోవ‌డం.., చంద్రబాబు కూడా ప్రశ్నించ‌క‌పోవ‌డం చూస్తే వారిద్దరి మ‌ధ్య లాలూచీ ఉన్నట్టు స్పష్టం అవుతుంద‌న్నారు.

 

ఐదేళ్ల చంద్రబాబు పాల‌నంతా రాగ‌ద్వేషాల‌తో న‌డిచింద‌న్నారు. చంద్రబాబు పాల‌న‌కి జ‌గ‌న్ పాల‌న‌కి న‌క్కకు నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉందిని మంత్రి పేర్ని నాని అన్నారు. కుల‌మ‌తాలు, రాజ‌కీయాల‌కు అతీతంగా పాల‌న అందిస్తున్న సీఎం జ‌గ‌న్ పై వ్యక్తిత్వ హ‌న‌నానికి పాల్పడేలా మాట్లాడుతుంటే జ‌నం హ‌ర్షించ‌ర‌న్నారు. గ‌డిచిన ఐదేళ్లలో ఇలాంటివి ఎన్నిజ‌రిగినా జ‌నం జ‌గ‌న్‌నే గెలిపించార‌ని తెలిపారు. ఆల‌యాల్లో 50 శాతం ఎస్సీ, బీసీల‌కు నియామ‌కాలు చేస్తు ఇచ్చిన ఉత్తర్వులు దేవాదాయ, ధ‌ర్మాదాయ‌ నిబంధ‌న‌ల ప్రకార‌మే జ‌రుగుతున్నాయ‌ని మంత్రి పేర్ని నాని అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: