రాజకీయాల్లో ఇపుడు నైతిక విలువలు వెతకడం అంటే ఏడారిలో నీటి కోసం బావి తవ్వడమే. ఎపుడో విలువల వలువలూ వూడిపోయాయి. కర్ర ఉన్నవాడిదే  బర్రె అన్న అరాచక  నీతి అమలవుతోంది. పేరుకు ప్రజాస్వామ్యం కానీ, దాన్ని ఎలా తమకు అనుకూలంగా మార్చుకోవాలో తెలిసిన మేధావులు అక్కడ చాలా మంది ఉన్నారు. ఇక మాస్టర్ డిగ్రీ చేసిన వారు కూడా ఎందరో ఉన్నారు.

ఈ నేపధ్యంలో మహారాష్ట్ర రాజకీయలు కొత్త పాఠాలు చెబుతున్నాయి.ఇప్పటివరకూ లేని పాఠాలు ఇవి. వీటిని రానున్న రోజుల్లో మిగిలిన వారు అనుసరించడానికి వీలుగా చేసుకుంటూ పోతున్నారు. మనకు బలం ఉంటే సర్కార్ ఏర్పాటు చేయడం ఒకనాటి నీతి. మనకు లేకపోతే పక్కవారిని దేబిరించి వారి మద్దతుతో సర్కార్ ఏర్పాటు చేయడం మధ్యరకం నీతి. ఈ విషయంలో నయాలు భయాలు లోపాయికారి ఒప్పందాలు ఉంటాయనుకోవాలనుకోండి.

 

ఇవి కాకుండా ఇపుడు మహా రాజకీయంలో కొత్త రకం మలుపులు కనిపిస్తున్నాయి. అవేంటి అంటే మద్దతు ఇవ్వని పార్టీని నిలువనా చీల్చేసి ఆ మద్దతుతో సర్కార్ని ఏర్పాటు చేయడం. ఓ విధంగా ఇది దౌర్జన్య కాండ. కానీ అధికారం చేతిలో ఉన్న వారికి మాత్రమే ఇది సులువుగా పనికివచ్చే విధానంగా ఉంది.

 

ఎన్సీపీని నిలువునా చీల్చేసి అజిత్ పవార్ సర్కార్ ఏర్పాటు చేశారు. అయితే ఆయన వైపు ఎంతమంది ఉన్నారో తెలియదు, ఇంకా మరింతమంది ఎమ్మెల్యేలు కావాలి. వారిని ఇపుడు మంత్రి పదవులతో ఆకట్టుకోవడానికి చూస్తున్నారుట. మంత్రి పదవులు ఒక్కటే కాదు, ఇంకా తాయిలాలు అదనపు అకర్షణ. మరి దీనికి లొంగి ఎంతమంది బంగీ జంపు చేస్తారో చూడాలి. మొత్తానికి మహా రాజకీయం రాజకీయాలు ఎంతలా పతనం అవుతాయో కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తోంది మరి భావి తరాలు ఈ పాఠాలను తమ కొత్త సిలబస్ గా పెట్టుకుని ఆచరిస్తాయి కదా. అందుకే కదా ఇందంతా చేస్తోంది కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: