ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 52 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నారు.  సమ్మెలో భాగంగా ఇవాళ సేవ్‌ ఆర్టీసీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్లు, కూడళ్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  ఈ 52 రోజుల్లో పలువురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు, గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో టీఎస్ఆర్టీసీ సమ్మెకు దిగింది.  

 

ఈ పోరాటానికి కర్త, కర్మ, క్రియగా అశ్వర్థామరెడ్డి ముందుండి సాగించారు.  అయితే ఇన్ని రోజులు పలుమార్లు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను హెచ్చరిస్తూ వస్తూనే ఉంది.  విధుల్లోకి చేరాలని..ప్రజలకు ఎలాంటి అంతరాయం, ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరింది.  కానీ ప్రభుత్వ నుంచి పూర్తి స్పష్టత రావాలని..తమ డిమాండ్లు నెరవేర్చాలని పట్టిన పట్టు వీడకుండా సమ్మె కొనసాగిస్తూ వచ్చారు.  ఈ నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకోవడం..తర్వాత ఈ విషయాన్ని లేబర్ కోర్టు చూసుకుంటుందని చెప్పడం..అన్నీ జరిగిపోయాయి.

 

తెలంగాణలో 48వేల మంది కార్మికులు 52 రోజులుగా సమ్మెను కొనసాగించడం  ఇదే తొలిసారి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు 2011లో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 27 రోజుల పాటు సమ్మె చేశారు.  అప్పట్లో సకల జనుల సమ్మె మంచి ప్రభావం చూపించింది.  అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ సమ్మె మేజర్ అని చెప్పొచ్చు. అయితే మొదటి నుంచి టీఎస్ఆర్టీసీకి విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ప్రైవీటీకరణ విషయం పై నే ఎక్కువ శ్రద్ద చూపిస్తూ వచ్చారు.  

 

ఇప్పటికే ఆర్టీసీ చాలా నష్టాల్లో కూరుకు పోయిందని..ఇక భరించడం ప్రభుత్వం వల్ల కాదని ముందు నుంచే చెబుతున్నారు.  ఇదిలా ఉంటే..టీఎస్ఆర్టీసీ కార్మికులు ఎట్టకేలకు సమ్మెను విరమించారు. 52 రోజులుగా నిరవధిక సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు.. రేపటి నుంచి విధుల్లోకి వెళ్లాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. తాము సమ్మె విరమించడం కార్మికులు ఓడిపోవడం కాదని.. అటు ప్రభుత్వం గెలుపు కూడా కాదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.  

సమ్మె కాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. అందుకు చింతిస్తున్నామని అన్నారు. అయితే సమ్మెవిరమణపై టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్మికులను ఎట్టి పరిస్ధితుల్లోనూ విధుల్లోకి తీసుకునేది లేదని ఆయన తేల్చి చెప్పారు. సమ్మె విషయంలో యూనియన్ లీడర్ల మాట వింటూ వస్తున్న కార్మికులు ఉన్నట్టుండి సమ్మె విరమిస్తామని చెప్పడం..అంతా వారి ఇష్టమేనా అని అన్నారు.  


లేబర్ కోర్టు నిర్ణయం తీసుకునే వరకు సంయమనం పాటించాలని ఎండీ సూచించారు. విధుల్లో చేరతామని జేఏసీ   నేతలు చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని సునీల్ శర్మ వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఇరకాటంలో పడ్డట్టయ్యింది..అటు ప్రభుత్వం మాట వినక..ఇటు తమ నాయకుడు ఏదో చేస్తారని..రెంటికి చెడ్డ రేవడిగా మారిందని ఆవేదన పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: