తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఆర్టీసీ స‌మ్మె విష‌యంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆర్టీసీ సంస్థ బాగుప‌డాలి...కార్మికులు బాగుప‌డాలని తాను కోరుతున్నాన‌ని...అందుకే శుక్ర‌వారం ఉద‌యం విధుల్లో చేరాల‌ని కేసీఆర్ పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యంపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ....ఈ మేర‌కు పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో చేరుతున్నారు. అయితే, ఇదే స‌మ‌యంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ...ఇటు ఆర్టీసీ కార్మికుల‌ను అటు కేసీఆర్‌ను ఇర‌కాటంలో ప‌డే ప్ర‌క‌ట‌న చేశారు. 

 

రవాణాశాఖ మంత్రిగా త‌న అనుభ‌వాలు చెప్తూ..కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ``నేను మంత్రిగా ఉన్న‌ప్పుడు రామారావు అనే ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు సడన్‌గా సమ్మెకు పిలుపునిచ్చాడు. 11 రోజులు సమ్మె చేశారు. అప్పుడు చాలా కష్టపడి వేరే బస్సులు పెట్టి నడిపినం. అప్పుడు ఆయన మాట్లాడుతూ మాకు గౌరవప్రదమైన రిట్రీట్ కావాలే అన్నడు. కానీ ఆయనతో మాట్లాడలే. ఆయన ముఖం కూడా చూడలే. తర్వాత నన్ను కలిసేందుకు వస్తే అడిగిన. ఎందుకు సమ్మె చేసినవంటే.. మా యూనియన్లు బతుకాలే గదా అన్నడు. సంస్థ బతికి ఉంటే కదా యూనియన్ బతికి ఉండేది! యూనియన్ బతుకాలనే లక్ష్యంతో సంస్థనే చంపితే.. కార్మికులు ఎటు పోతరు? అని అడిగిన. ఇప్పుడు కూడా ఇదే ఉన్మాదం. ఈ ఉన్మాదంలో పడి కార్మికులు బతుకులు పాడుచేసుకోవద్దు. క్రమశిక్షణతో ఉంటే సింగరేణి కార్మికుల్లాగా తీర్చిదిద్దుత. ఈ యూనియన్లను నమ్ముకుని కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టు కాకుండా.. కార్మికులు రండి.. నాతో పాటు మంత్రులు కూడా ఉంటరు.`` అని హామీ ఇచ్చారు.

 

అయితే, ముఖ్య‌మంత్రి కేసీఆర్ యూనియ‌న్ల‌పై చేసిన కామెంట్ల‌పై అశ్వ‌త్థామ‌రెడ్డి ఘాటుగా స్పందించారు. కార్మికుల సమస్యలు తీర్చేలా ప్రభుత్వం ముందుకెళ్లాలని కోరుతున్నాన‌ని, యూనియన్లు ఉండాలా లేదా అన్నది లేబర్ కోర్టు తేలుస్తుందని ఆయ‌న వ్యాఖ్యానించారు. ``దశాబ్దాల కాలంగా ట్రేడ్ యూనియన్ లు ఉన్నాయి. కార్మిక సంఘాలతో పాటు అనేక ఉధ్యోగ.. ఉపాధ్యాయ సంఘలు తెలంగాణ కోసం పోరాటంలో ముందున్నాయి. మేం యూనియన్లను వదిలేందుకు సిద్దంగా ఉన్నాం. అందుకే రెఫరెండం పెట్టండి...యూనియన్లు ఉండాలా వద్దా తేల్చండి``అని ప్ర‌క‌టించారు. త‌ద్వారా, ఇటు కార్మికులు, అటు కేసీఆర్‌ను అశ్వ‌త్థామ‌రెడ్డి ఇర‌కాటంలో ప‌డేశారు. యూనియ‌న్ల‌పై ఓటింగ్ నిర్వ‌హించ‌డానికి ప్ర‌భుత్వం ముందుకు రాక‌పోవ‌చ్చు. ఒకవేళ ముందుకు వ‌స్తే...కార్మికులు యూనియ‌న్లు ఉండాల‌ని ఓటు వేస్తే...స‌ర్కారుకు షాకే. వ‌ద్ద‌ని ఓటు వేస్తే...స‌హ‌జంగానే...యూనియ‌న్ల‌కు మైండ్ బ్లాంక్‌. ఈ నేప‌థ్యంలో అశ్వ‌త్థామ‌రెడ్డి ప్ర‌క‌ట‌న‌పై ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: