మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి చంద్రబాబునాయుడు వ్యవహారం విచిత్రంగా తయారైంది. ప్రతిచిన్న విషయంలోను పోలీసులనే టార్గెట్ చేసుకుని రెచ్చిపోతున్నారు. తాజాగా జరిగిన వివాదంలో కూడా చంద్రబాబు కానీ టిడిపి నేతలు కానీ జగన్మోహన్ రెడ్డితో పాటు డిజిపి గౌతమ్ సవాంగ్ ను టార్గెట్ చేసుకోవటం ఆశ్చర్యంగా ఉంది.

 

అమరావతి ప్రాంతంలో రెండు రోజుల క్రితం చంద్రబాబు పర్యటించినపుడు కాన్వాయ్ పై చెప్పులు, రాళ్ళు పడిన విషయం అందరికీ తెలిసిందే. నిజానికి చంద్రబాబు అసలు పర్యటన పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. గడచిన ఐదునెలల్లో అమరావతి ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని ప్రపంచం ముందు ఉంచటానికే తాను పర్యటించినట్లు చెప్పారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అమరావతి ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అందరికీ తెలుసు.

 

అందరికీ తెలిసిన విషయాన్నే మళ్ళీ చంద్రబాబు ప్రపంచానికి చాటి చెప్పటమేంటి ? అంటే పర్యటించటంలోనే చంద్రబాబు ఉద్దేశ్యం అర్ధమైపోతోంది. తాను అమరావతి ప్రాంతంలో పర్యటిస్తే గొడవ జరుగుతుందని తెలిసే కావాలనే చంద్రబాబు పర్యటించారన్నది స్పష్టంగా తెలిసిపోతోంది. సరే ప్రతి విషయాన్ని రాజకీయం చేసి లబ్దిపొందాలని ప్రయత్నించే చంద్రబాబు నుండి ఇంతకన్నా ఎవరూ ఏమీ ఆశించలేరు.

 

అయితే రాజకీయ లబ్దిని ఆశిస్తున్న చంద్రబాబు సిఎం పై ఆరోపణలతో సరిపెట్టుకోకుండా డిజిపిని కూడా లాగుతున్నారు. చంద్రబాబు కాన్వాయ్ పై జరిగిన దాడిలో జగన్ తో పాటు డిజిపి కూడా బాధ్యత వహించాలట. ఇదే విషయమై డిజిపిపై కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు. పార్లమెంటులో కూడా ప్రస్తావిస్తారట. సవాంగ్ ను  డిజిపి చేయటం ఇష్ట లేకే చంద్రబాబు ఆయన్ను పక్కనపెట్టేశారు. అలాంటిది ఇపుడు అదే సవాంగ్ డిజిపి అవటాన్ని తట్టుకోలేకున్నారు.

 

నిజానికి సిఎంగా ఉన్నపుడు పోలీసులను అడ్డదిడ్డంగా వాడుకున్నదే చంద్రబాబు. అధికారంలో ఎవరుంటే వారు చెప్పినట్లుగా పోలీసులు వింటారన్న విషయం చంద్రబాబుకు తెలీదా ?  పోలీసు వ్యవస్ధను పూర్తిగా దిగజార్చేసిన చంద్రబాబు ఇపుడు నీతులు మాట్లాడుతున్నారు. పోలీసులు స్వేచ్చగా విధులు నిర్వర్తించలేకపోతున్నారని ఇపుడు కతలు చెబుతున్నారు. తన హయాంలో పోలీసులు స్వేచ్చగా విధులు నిర్వర్తించారా ?  ఎంతమంది వైసిపి ఎంఎల్ఏలు, నేతలపై పోలీసులు ఉసిగొలిపి కేసులు పెట్టించారో మరచిపోయినట్లున్నారు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: