ఓ వ్యక్తి సొంతంగా పార్టీ పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లి నెగ్గి సీఎం పీఠం ఎక్కడమంటే మాటలు కాదు. అందుకు ఎంతో తపన, కృషి, పట్టుదల, కష్టం, అదృష్టం అవసరం. వీటన్నింటినీ కలగలుపుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు పదేళ్లు పోరాడి, ప్రజల్లో ఉండి 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యారు. మరి అలాంటి వ్యక్తి పరిపాలన ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అందుకు తగ్గట్టే జగన్ పాలన ఉందనేది పరిశీలకుల మాట. నేటితో ఆయన పరిపాలనకు ఆరు నెలలు పూర్తయ్యాయి.

 

 

2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ మొదటి రోజు నుంచే పాలనపై దృష్టి పెట్టారు. ఏం చేస్తే తాను ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చగలననే విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ సీఎం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో దాదాపు 4లక్షల ఉద్యోగాలు ఇవ్వడమంటే సామాన్యమైన విషయం కాదు. ఎవరు కాదన్నా ఇది విపక్షాలకు మింగుడుపడని అంశం. ఆటో డ్రైవర్లకు నగదు, అమ్మ ఒడి, రైతు భరోసా, వృద్ధాప్య పెన్షన్, కిడ్నీ రోగులకు పెన్షన్ పెంపు, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు.. ఇలా ప్రతి అంశంలో జగన్ తన మార్కు చూపించారు.

 

 

మద్యపాన నిషేధం అమలులో భాగంగా తీసుకుంటున్న చర్యలు, ఇసుక అక్రమాలు లేకుండా తీసుకొచ్చిన కొత్త పాలసీ, అవినీతి రహిత పాలన కోసం తీసుకొచ్చిన టోల్ ఫ్రీ నెంబర్.. ఇలా జగన్ ఆరు నెలల్లోనే పాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు. వీటన్నింటినీ జీర్ణించుకోలేని విపక్షాలు మాత్రం అనేక విమర్శలు చేస్తున్నా అవేమీ తనకు అడ్డు కావని కేవలం పని మీద మాత్రమే నిమగ్నమయ్యారు. సీఎం అయ్యాక ఏడాదిలోపే మంచి ముఖ్యమంత్రి అని నిరూపించుకుంటాను అన్న ఆయన మాటలు నిజమవుతున్నాయనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: