ఏపీ ముఖ్య‌మంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆరునెల‌ల పాల‌న పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆరునెల‌ల పాల‌న నేప‌థ్యంలో త‌మ స‌ర్కారు తీసుకున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను తీసుకున్న‌ట్లు వైసీపీ నేత‌లు, మంత్రులు ఇప్ప‌టికే తెలియ‌జేశారు. అయితే, దీనిపై తెలుగుదేశం పార్టీ ఊహించ‌ని రీతిలో స్పందించింది. ఏకంగా ఓ పుస్త‌కం ప్ర‌చురించి జ‌గ‌న్ స‌ర్కారుపై విరుచుకుప‌డింది. 'మంచి సీఎం కాదు.. జనాన్ని ముంచే సీఎం' పేరుతో తెలుగుదేశం పార్టీ రూపొందించిన పుస్త‌కాన్ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు విడుద‌ల చేశారు. మాట తప్పారు..మడమ తిప్పారు అంటూ ఆయ‌న సీఎం జ‌గ‌న్‌ను ఎద్దేవా చేశారు. అయితే, దీనిపై వైసీపీ త‌క్ష‌ణ‌మే స్పందించింది. అమరావతిలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ…తమ పాలనను నిందించే హక్కు టీడీపీకి లేదని,  ప్రజలు ఊహించిన దాని కంటే వేగంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

 

జ‌గ‌న్ స‌ర్కారుపై పుస్త‌కం విడుద‌ల చేసిన టీడీపీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు వైసీపీ నేత జగన్ త‌న‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారని...ప్ర‌జ‌లు ఆ చాన్స్‌ ఇస్తే ప్రజలను మోసం చేశారని విమర్శించారు.  ఏ హామీ పరిపూర్ణంగా అమలు చేయలేదని మండిప‌డ్డారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రతిపక్షాలను టార్గెట్ చేశారని, వేధించ‌డం, త‌న‌కు న‌చ్చిన ప‌నులు చేసుకోవ‌డం అనే ఎజెండాతోనే...జ‌గ‌న్ పాల‌న సాగింద‌న్నారు. త‌న వారికి మేలు చేయ‌డం కోస‌మే జ‌గ‌న్ ప‌నిచేస్తున్నార‌ని ఆరోపించారు. 

 

కాగా, మాజీ మంత్రి య‌న‌మ‌ల కామెంట్ల‌పై ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి క‌న్న‌బాబు స్పందించారు. సీఎం జగన్‌ పాలనలో ప్రతి ఒక్కరూ సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. అందరూ ఊహించిన దానికన్నాముఖ్యమంత్రి... ఎక్కువగా.. చాలా వేగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు. గ‌త ప్రభుత్వం దారుణంగా రాష్ట్రాన్ని, వ్యవస్థలను విచ్చీన్నం చేసి వదిలి వెళ్లిపోయిందన్నారు. ఈ తరుణంలో వైఎస్‌ జగన్‌ ఏ రకంగా నెట్టుకొస్తారోనని అందరూ ఆసక్తిగా చూశారని పేర్కొన్నారు. అన్ని వర్గాల్లో ఒక సంతృప్తి కలిగేలా జగన్‌ గారు తన పాలనను సాగిస్తున్నారు. ఈ విధమైన పాలననే మేం కోరుకున్నామనే ఆనందం ప్రజల్లో  కనిపిస్తోందన్నారు. ``దేశంలోనే బాగా పనిచేసే ముఖ్యమంత్రుల పేరును తీస్తే పై వరసలో జగన్మోహన్‌ రెడ్డి పేరు కనిపిస్తోంది. అందరి మన్ననలను పొందే విధంగా ప్రస్తుత పరిపాలన వుందనే భావం సర్వత్రా వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే దాదాపు నూరు నిర్ణయాలు తీసుకున్నారు. ఇది సాధ్యామా అని దశాబ్దాలుగా పాలకులు చాలా ఒత్తిడికి గురై తీసుకోలేని నిర్ణయాలను...జగన్ కొద్ది రోజుల్లోనే ఆచరణలో చూపారు. పరిపాలనలో ఒక మోడల్ గా అందరికీ ఆయన కనిపిస్తున్నారు. ఒకవైపు ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసే విధానం..మరోవైపు అవినీతిరహిత పాలన. అలాగే మరోవైపు గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే విధానం. గాడి తప్పిన వ్యవస్థలను సక్రమంగా పద్దతిలో పెట్టే పనితీరు. మరోవైపు మెరుగైన పాలన కోసం చేస్తున్న సంస్కరణలు...అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సవ్యసాచిలా పనిచేస్తున్నారు. ఆయన పాలనను రాజకీయ విశ్లేషకులు ప్రసంశిస్తున్నారు. ఆయనతో కలిపి పనిచేస్తున్న మాకు ఎంతో గర్వంగా వుంది. ఇటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేసే అవకాశం వచ్చినందుకు అందరం సంతోషంతో వున్నాం. ఈ ఆరునెలల పాలన అద్భుతంగా కొనసాగింది. ఎవరికీ సాధ్యంకాని నిర్ణయాలు అమలు చేసి చూపించారు. ఇవ్వన్నీ చూస్తున్న కొందరికి మాత్రం ముఖ్యమంత్రి గారి పనితీరు పట్ల కడుపుమంట పెరుగుతోంది.`` అని అన్నారు. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: