ఏపీలో ఓ తండ్రీకొడుకుల రాజకీయానికి తెలుగుదేశం పార్టీ కేడర్ ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంది. ఇద్దరు వేరు వేరు పార్టీలలో నడవడంతో కేడర్ కు ఎవరితో నడవాలో అర్ధం కావడం లేదు. టీడీపీ కేడర్ ని ఇంతలా కన్ఫ్యూజ్ చేస్తున్న తండ్రీకొడుకులు ఎవరో కాదు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, కర్నూలు టీడీపీ ఇన్-చార్జ్ టీజీ భరత్. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి దారుణంగా ఉండటంతో టీజీ వెంకటేష్ కుమారుడుతో కలిసి టీడీపీలో చేరారు.

 

అప్పుడు జరిగిన 2014 ఎన్నికల్లో వెంకటేష్ కర్నూలు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి 3 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఓడిపోయిన టీజీ ఫ్యామిలీకి చంద్రబాబు తగిన ప్రాధాన్యత ఇచ్చారు. వెంకటేష్ కు రాజ్యసభ పదవి ఇచ్చారు. అలాగే 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్ రెడ్డిని కాదని టీజీ తనయుడు భరత్ కు టికెట్ ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో భరత్ వైసీపీ అభ్యర్ధి అబ్దుల్ అజీజ్ చేతిలో 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

 

అటు రాష్ట్రంలో కూడా టీడీపీ దారుణంగా ఓడిపోవడంతో టీజీ వెంకటేష్...సుజనా చౌదరీ బ్యాచ్ తో కలిసి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే భరత్ మాత్రం టీడీపీలోనే కొనసాగుతానని చెప్పి అందులోనే ఉండిపోయారు. ఇక ఇక్కడ నుంచే టీడీపీ కేడర్ అయోమయంలో పడిపోయింది. తండ్రి ఓ పార్టీ, కొడుకు ఓ పార్టీలో ఉండటంతో ఎవరి వైపు వెళ్లాలో వారికి అర్ధం కావడం లేదు. పైగా మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి.

 

ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవాలని టీజీ వెంకటేష్ తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అటు భరత్ కూడా టీడీపీకి మెజారిటీ స్థానాలు వచ్చేలా చేయాలని కష్టపడుతున్నారు. దీంతో టీజీ ఫ్యామిలీకి మద్ధతు ఇచ్చే టీడీపీ వర్గానికి ఎటువైపు వెళ్లాలో అర్ధం కావడం లేదు. ఈ కన్ఫ్యూజన్ ఎన్నికలవరకు కొనసాగితే టీడీపీకి నష్టం జరగొచ్చని భయపడుతున్నారు. మొత్తానికైతే ఈ తండ్రీకొడుకుల రాజకీయానికి టీడీపీకి గట్టి దెబ్బ తగిలేలా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: