ప్రియాంక హత్యకేసులో నిందితులకు 14రోజుల రిమాండ్ విధించారు మేజిస్ట్రేట్‌. తీవ్ర ఉద్రిక్తతల మధ్య నిందితులను జైలుకు తరలించారు. ఉదయం నుంచి షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు హైడ్రామా నడిచింది. నిందితులకు ఉరిశిక్ష విధించాలంటూ జనం పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. దీంతో వైద్యులను , మేజిస్ట్రేట్‌ను పోలీస్ స్టేషన్‌కే తీసుకెళ్లి అక్కడే విచారించి నిందితులను జైలుకు తరలించారు. 

 

ప్రియాంక హత్య షాద్‌నగర్‌లో ప్రకంపనలు సృష్టించింది. నిందితులను షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారన్న సమాచారంతో జనం ఒక్కసారిగా తరలివచ్చారు. విద్యార్థులు, స్థానికులు పోలీస్‌ స్టేషన్‌ను చుట్టుముట్టారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా పోలీస్ స్టేషన్‌ గేట్లకు తాళం వేశారు. అయినా .. కొందరు గేటు దాటుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, స్థానికుల మధ్య తోపులాట జరిగింది.

 

అందరిదీ ఒకటే మాట. నిందితులను ఉరి తీయాలని జనమంతా డిమాండ్ చేశారు. కాలయాపన చేసి, కేసును నీరుగార్చొద్దంటూ నినాదాలు చేశారు. నిందితులకు ఉరి తీసి ప్రియాంకకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. జస్టిస్‌ ఫర్‌ ప్రియాంక పేరుతో ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఆందోళన విరమించాలని పోలీసులు కోరినా... వెనక్కి తగ్గలేదు. పోలీసులతో గొడవకు దిగారు.

 

నిందితులను వైద్య పరీక్షల కోసం తరలించాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో డాక్టర్లనే పోలీస్‌ స్టేషన్‌కు రప్పించారు. పీఎస్‌లోనే నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.  సమయం మించిపోవడంతో... మేజిస్ట్రేట్‌ను కూడా పోలీస్‌ స్టేషన్‌కు రప్పించారు. నిందితులను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చగా...14 రోజుల రిమాండ్‌ విధించారు. తీవ్ర ఉద్రిక్తల మధ్య నిందితులను జైలుకు తరలించారు పోలీసులు. నిందితులను అంత జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను తీసుకెళ్లేటపుడు ఆ వ్యాన్లపై చెప్పులు, రాళ్లు విసిరి తమ కోపాన్ని ప్రదర్శించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: