తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల‌కు ఊహించ‌ని షాకిచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరిన తర్వాత వారితో సమావేశమవుతానని గత క్యాబినెట్ సమావేశానంతరం ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ మాట ప్రకారం వారిని ప్రగతిభవన్‌కు పిలిపించుకొని కూలంకషంగా మాట్లాడనున్నారు. ఈ మ‌ధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సమావేశం ప్రారంభంకానుండటంతో 12 గంటల్లోగానే సిబ్బంది ప్రగతిభవన్‌లోకి వచ్చేలా అధికారులు శనివారం సాయంత్రం నుంచే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. స‌హ‌జంగానే...ఆత్మీయ సమావేశంపై ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ మొదలైంది. ఆర్టీసీ భవిష్యత్తుపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? సంస్థను లాభాలబాట పట్టించేందుకు ఎలాంటి ప్రణాళిక అమలుచేస్తారు? అన్న ప్రశ్నలు కార్మికుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే, మీటింగ్‌కు ముందే..కేసీఆర్ ఊహించ‌ని షాకిచ్చార‌ని అంటున్నారు.

 


ఆర్టీసీ ప్ర‌స్తుత స్థితిగ‌తుల‌ను పేర్కొంటూ వారికి కార్మికుల‌కు క‌నువిప్పు క‌లిగేలా..ఇదీ ఆర్టీసీ వాస్తవ స్థితి...అని తెలిసివ‌చ్చేలా...కేసీఆర్ ఓ నివేదిక రూపొందించార‌ని స‌మాచారం. ఆత్మీయ స‌మావేశం పేరుతో కేసీఆర్ ఏర్పాటు చేసిన స‌మావేశంలో తెలుగులో రూపొందించిన ఓ బుక్‌లెట్‌ను ఆర్టీసీ కార్మికులకు అందజేయనున్నారు. ఇందులో సంచ‌ల‌న అంశాలున్న‌ట్లు స‌మాచారం. నిజాం కాలంలో ప్రారంభమైన రోడ్డు రవాణా సంస్థ, ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన ఏపీఎస్ ఆర్టీసీ, తెలంగాణ ఏర్పాటు తర్వాత వచ్చిన టీఎస్‌ఆర్టీసీ గురించి నివేదిక రూపంలో వివరించారు. ప్రస్తుతం టీఎస్‌ఆర్టీసీలో ఉన్న బస్సులు సంఖ్య, సంస్థ ఆర్థిక పరిస్థితి, ఇప్పటివరకు నమోదైన నష్టాలు, చెల్లించాల్సిన రుణాలు, ప్రభుత్వం నుంచి పొందిన సహాయం, ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిలు, బస్సుల రిప్లేస్‌మెంట్ విధానం, ఉద్యోగుల వివరాలు, సంవత్సరాలవారీగా పదవీ విరమణచేసిన ఉద్యోగుల వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారు. ఇలా ఆర్టీసీ ఏర్పాటు నాటినుంచి ఇప్పటివరకు సంస్థ స్థితిగతులపై అధికారులు పూర్తి నివేదికను రూపొందించి కార్మికుల‌కు అందించ‌నున్నారు.


కార్మికులు అవాక్క‌య్యే అంశాల‌ను ఇందులో పేర్కొన‌నున్నట్లు తెలుస్తోంది. 2018-19లో టీఎస్‌ఆర్టీసీ రూ.4,882.72 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. వ్యయం రూ.5,811.39 కోట్లుగా ఉన్నది. అంటే రూ.928.67 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఆర్టీసీ ఆదాయంలో ఉద్యోగుల జీతాలకు రూ.2,829.00 కోట్లు (58 శాతం) ఖర్చువుతున్నది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో సంస్థ నష్టం రూ.1,200 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నుంచి రూ.3,903.55 కోట్లు, జీహెచ్‌ఎంసీ నుంచి రూ.336.40 కోట్లు కలిపి టీఎస్‌ఆర్టీసీమొత్తం రూ.4,239.95 కోట్ల ఆర్థికసాయాన్ని పొందింది. ఇలా...అన్ని అంశాలు వివ‌రిస్తూ..కార్మికులు కొత్త డిమాండ్ ఏదైనా చేయాల‌నుకుంటే...అలాంటి చాన్సివ్వ‌కుండా చేశార‌ని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: