ప‌శువైద్యురాలు ప్రియాంక రెడ్డి దారుణ హ‌త్య ఘ‌ట‌న అంద‌రినీ క‌ల‌చివేసిన సంగ‌తి తెలిసిందే. ప్రాంతాల‌కు అతీతంగా, సామాన్యులు- ప్ర‌ముఖులు అనే తేడాలేకుండా...ఆమె మ‌ర‌ణాన్ని తీవ్రంగా ఖండించారు. దోషుల‌కు క‌ఠినంగా శిక్ష ప‌డాల‌ని కోరుతున్నారు. ఇదే అంశాలు పేర్కొంటూ..ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రియాంక సంఘటన పట్ల తీవ్రంగా స్పందించిన కేటీఆర్ ఈ మేర‌కు వ‌రుస‌గా నాలుగు ట్వీట్లో త‌న మ‌నోభావాలు వ్య‌క్తం చేస్తూ...చ‌ట్టాల‌ను మార్చాల‌ని దోషుల‌కు క‌ఠిన శిక్ష‌లు ప‌డాల‌ని ఆకాంక్షించారు. 

 

 ప్రధానమంత్రికి ట్వీట్ చేసిన కేటీఆర్ ఈ ట్వీట్ల ప‌రంప‌ర‌లో ప‌లు కీల‌క అంశాల‌ను పేర్కొన్నారు. `` ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటనలో ఇప్పటివరకూ దోషులకు ఉరిశిక్ష పడలేదు. మ‌రో ఉదంతంలో 9 నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి హైకోర్టు శిక్ష తగ్గించింది.  ఇలాంటి పరిస్థితుల్లో దారుణంగా క‌న్నుమూసిన వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ ప్రియాంకరెడ్డి కుటుంబానికి మనం ఎలా హామీ ఇవ్వగలం? - ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది.  పార్లమెంట్ జరుగుతుంది కనుక పూర్తి రోజు దీనిపై చర్చ జరగాలని కోరుకుంటున్నా`` అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

 

మహిళలు, చిన్నారులపై గాయాలకు పాల్పడినట్లు దోషిగా తేలితే మళ్లీ తీర్పుపై సమీక్ష లేకుండా శిక్షించాలని త‌న ట్వీట్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని కేటీఆర్ కోరారు. న్యాయం ఆలస్యమైతే బాధితులకు అన్యాయం జరిగినట్లు అవుతుంద‌ని కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. ``అత్యాచార ఘటనలకు కఠిన శిక్షలు పడేలా చట్టాలను సవరించాలి. నేరం చేయాలంటే భయపడేలా కఠిన శిక్షలు విధించాలి.  వేలాది మంది పౌరుల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను... చట్టాలను సవరించాల్సిన సమయం వచ్చింది.` అని కేటీఆర్ త‌న ట్వీట్లో అభ్య‌ర్థించారు. దేశ‌వ్యాప్తంగా భ‌గ్గుమంటున్న కీల‌క అంశంపై చ‌ట్టాల‌ను స‌వ‌రించాల‌ని కోరుతూ టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: