``రామ‌యాణం గురించి మీకంద‌రికీ తెలుసుక‌దా? యుద్ధంలో రామబాణం వల్ల అర్ధాయుష్షుతో మరణించిన రాక్షసులు కొందరు తమ పరిస్థితి ఏమిటని రాముణ్ణి అడిగినప్పుడు కలియుగంలో మీరు అక్కడక్కడా పుట్టండి అంటారు. అలా పుట్టిన వారే మనుషులను పీక్కుతింటున్నారని,  వారే ఆర్టీసీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నరు`` ఇది ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన కామెంట్. ఆర్టీసీలోని యూనియ‌న్లు, ప్ర‌తిప‌క్షాలను ఉద్దేశిస్తూ కేసీఆర్ చేసిన కామెంట్లు ఇవ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.  ఆర్టీసీ ఉద్యోగులతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి...ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో వారితో భోజనం చేశారు. అనంత‌రం వారితో మాట్లాడుతూ..అధికారులు, ఉద్యోగులు సమిష్టిగా కృషి చేసి ఆర్టీసీని బతికించుకోడానికి ప్రతిజ్ఞ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. త‌ద్వారా ఇత‌రుల జోక్యం వ‌ద్ద‌నే మాట చెప్పారు. ఆర్టీసీకి తానే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తానని ప్రకటించారు. 

 

తాను రవాణా శాఖ మంత్రిగా మూడేళ్లు పనిచేసి, ఆర్టీసీని లాభాల బాట పట్టించానని, నేటికీ తనకు ఆర్టీసీపై ఎంతో ప్రేమ ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆర్టీసిని బతికించడానికి ప్రభుత్వం తరుఫున చేయాల్సిందంతా చేస్తామని, ఇక అధికారులు, ఉద్యోగులు కలిసి పని చేసి, ఆర్టీసీని కాపాడాలన్నారు. నష్టాల్లో ఉన్న డిపోలను లాభాల బాట పట్టించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, రూట్లను రీ సర్వే చేయాలని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా  ప్రతీ నెలా ఒక రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కోరతామన్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రతీ రెండు నెలలకోసారి డిపో మేనేజర్లతో సమీక్ష నిర్వహించాలని, రవాణా మంత్రి నిరంతరం పర్యవేక్షించాలని కేసీఆర్ పేర్కొన్నారు. అవసరమైన పక్షంలో  రోజుకు గంటో, అరగంటో ఎక్కువ పనిచేయాలని ముఖ్యమంత్రి కోరగా, కార్మికులు హర్షధ్వానాలతో అంగీకరించారు. 

 

ఆర్టీసీలో యూనియ‌న్లు వ‌ద్ద‌ని తాను అనుకుంటున్నాన‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఓ రెండేళ్ల పాటు యూనియ‌న్లు లేకుండా క‌లిసి ప‌నిచేసుకుందామ‌ని, అనంత‌రం ఒక‌వేళ అవ‌స‌రం అనుకుంటే...యూనియ‌న్లు పెట్టుకుందామ‌ని కేసీఆర్ పేర్కొన్నారు. కాగా, కేసీఆర్ వ్యాఖ్య‌లు యూనియ‌న్ల‌కు ఊహించ‌ని షాక్ అని ప‌లువురు పేర్కొంటున్నారు. ఇప్ప‌టికే కార్యాల‌యాలు మూత‌వేసి...యూనియ‌న్ నేత‌ల‌ను విధుల్లో చేరేలా చేసిన గులాబీ ద‌ళ‌ప‌తి తాజా నిర్ణ‌యంతో మ‌రింత షాక్ ఇచ్చార‌ని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: