తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజికవర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని విషయం తెలిసిందే. వారే టీడీపీలో కీలక పాత్ర పోషిస్తారు. ఇక టీడీపీ అధికారంలోకి వస్తే వారి డామినేషన్ కూడా ఎక్కువే ఉంటుంది. గత ఐదేళ్లు కూడా అదే జరుగుతూ వచ్చింది. ఈ డామినేషన్ వల్ల టీడీపీకి ఎప్పుడు అండగా ఉండే బీసీ వర్గాలు కూడా దూరమైపోయారు. ఈ ప్రభావం 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. సరే ఆ విషయం వదిలేస్తే ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక చాలామంది కమ్మ నేతలు టీడీపీకి అండగా లేకుండాపోయారు. చాలామంది సైలెంట్ అయిపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వారు పెద్దగా బయట కనపడటం లేదు.

 

అసలు ఓటమి దెబ్బకు కొందరు సీనియర్ నేతలు ఇంకా కోలుకున్నట్లుగా కనిపించడం లేదు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్ బాబు, ఆలపాటి రాజాలు ఓడిపోవడమే యాక్టివ్ గా లేకుండాపోయారు. మూడుసార్లు చిలకలూరిపేట నుంచి గెలిచిన ప్రత్తిపాటి మొన్న ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓడిన దగ్గర నుంచి ఆయన సైలెంట్ అయిపోయారు. మీడియాలో కూడా పెద్దగా కనిపించలేదు. కాకపోతే పార్టీ కార్యక్రమాల్లో మాత్రం కనిపిస్తున్నారు.

 

అటు వినుకొండ నుంచి ఓడిపోయిన ఆంజనేయులు మొదట్లో కొంచెం బయటకురాకపోయిన...ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయినట్లే కనిపిస్తున్నారు. ఇక పెదకూరపాడు నుంచి ఓడిన శ్రీధర్ బాబు కూడా అంతగా బయట కనిపించలేదు. అటు తెనాలి నుంచి ఓడిన ఆలపాటి, గురజాల నుంచి ఓడిన యరపతినేనిలు మొదట్లో కొంచెం బయటకు రావడానికి ఇబ్బందిపడ్డా..ఇప్పుడు మాత్రం మీడియా ముందుకొచ్చి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

 

అయితే అధికారంలో ఉన్నప్పుడూ ఎప్పుడు మీడియాలో కనిపించిన ఈ ఐదుగురు కమ్మ నేతలు ఓడిపోయాక పెద్దగా బయటకు రాకపోవడం వల్ల అధికార వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట వేసే పనిలో బిజీగా ఉన్న చంద్రబాబుకు అండ తక్కువైంది. ఇక ప్రస్తుతం తెలుగుదేశంలో స్థానిక కమిటీలు ఎన్నిక జరుగుతుండటంతో వీరు ఇప్పుడుప్పుడే యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. మరి వీరు మరింత యాక్టివ్ అయ్యి రానున్న పంచాయితీ, స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో వారి నియోజకవర్గాల్లో టీడీపీని ఏ మేర గెలిపిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: