దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్  తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటనలో మ‌రో దారుణం జ‌రిగింది. తహశీల్దార్ విజయారెడ్డిపై సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. మంటల్లో కాలిపోతోన్న విజయారెడ్డిని.. కాపాడే ప్రయత్నంలో.. డ్రైవర్, అటెండర్ చంద్రయ్య తీవ్రంగా శ్రమించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఈ పెట్రోల్ దాడిలో రెండు రోజుల తర్వాత సురేష్ కూడా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తాజాగా  మరొకరు మృతి చెందారు. తహసీల్దార్ విజయారెడ్డిని మంటల నుంచి కాపాడబోయి తీవ్రంగా గాయపడిన అటెండర్ చంద్రయ్య  చనిపోయాడు. 

 

చంద్ర‌య్య గ‌త 28 రోజులుగా కంచన్ బాగ్ డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రయ్య ఇవాళ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో మృతి చెందాడు. చంద్రయ్య డెడ్ బాడిని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియాకు అధికారులు తరలించారు.    పోస్ట్ మార్టం తర్వాత శంషాబాద్‌కు కుటుంబ సభ్యులు తరలించనున్నారు. చంద్రయ్య మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నరవుతున్నారు. సరైన వైద్యం అందించకే చంద్రయ్య చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారని.. కనీస సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారని ఆగ్రహిస్తున్నారు. చంద్రయ్య స్వగ్రామం శంషాబాద్‌ మండలం రాళ్లగూడు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో పనిచేసిన ఆయన మూడేళ్ల క్రితం అబ్దుల్లాపూర్‌ మేట్ తహసీల్దార్ కార్యాలయానికి బదిలీ అయ్యాడు. విధి నిర్వ‌హ‌ణ సంద‌ర్భంగా జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఆయ‌న ఇలా క‌న్నుమూశాడు.

 

కాగా, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌ విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే.  ఘటనలో మొత్తం ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. తహసీల్దార్ విజయారెడ్డి, నిందితుడు సురేష్.. డ్రైవర్ గురునాథ్ తో పాటు అటెండర్ చంద్రయ్య చనిపోయాడు. మరోవైపు ఇదే ఘటనలో గాయపడిన నారాయణ అనే వ్యక్తి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: