ఏపీ సీఎం వైఎస్ జగన్ తనపై తన మతంపై వచ్చినా ఆరోపణలకు సమాధానం చెప్పారు. గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించేందుకు వైఎస్ జగన్ వచ్చారు ఈ సందర్బంగా తనపై గత కొన్ని రోజులుగా వస్తున్న విమర్శలకు ఆయన సమాధానం చెప్పారు. 

 

"నా మీద ఎవరెవరో అవ్వాక్కులు చెవాక్కులు పేలుతున్నారు. నా కులం మరియు నా మతంపై ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు వింటుంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. ఇప్పుడు చెప్తున్నా నా కులం మాట నిలబెట్టుకునే కులం, నా మతం మానవత్వం. నా మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావిస్తున్నాను. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకుంటున్నందుకు గర్వం గా ఉంది. నేను ఉన్నాను నేను విన్నాను అనే మాటను ఈ ఆరు నెలల్లోనే నిలబెట్టుకున్నా" అని సీఎం జగన్ చెప్పారు. 

 

జనవరి 1 నుంచి కొత్తగా ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేస్తాం, ఆరోగ్య శ్రీ కార్డుల మీద క్యూఆర్ కోడ్ ను నమోదు చేస్తాం. రూ 1000 పైబడిన వైద్య ఖర్చును ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకు వస్తాం. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో 130 హాస్పిటళ్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తున్నాము అని జగన్ పేర్కొన్నారు. కొత్తగా మరో 200 జబ్బులను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెస్తున్నట్లు జగన్ చెప్పారు. ఇకపై కాన్సర్ రోగులకు కూడా ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని పేర్కొన్నారు. 108 కి ఫోన్ చేసిన 20 నిమిషాల్లోపు  అంబులెన్సు మీ ఇంటి ముందుకే వచ్చి హాస్పిటల్ కు తీసుకువెళ్లి  వైద్యం అయ్యాక మళ్ళీ మీ ఇంటి ముందే దిగపెడుతుంది అని చెప్పారు. 

 

తలసీమియా రోగులకు జనవరి 1 నుంచి 10,000 రూపాయల పింఛన్ ను అందజేస్తున్నట్లు చెప్పారు. ఇక ఆరోగ్య శ్రీ లో భాగంగా చికిత్స తీసుకున్న రోగులకు శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి భృతి కింద రోజుకు రూ 225 చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: