తెలంగాణ ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం నేటి అర్ధరాత్రి నుంచి భారం కానుంది. ఆర్టీసి సమ్మె పై నిర్ణయం తీసుకున్న రోజున, తెలంగాణ సీఎం కెసిఆర్ ఆర్టీసిని బలోపేతం చేసేందుకు చార్జీల పెంపు అనివార్యమని ప్రకటించి కిమీ కు 20 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే పెరిగిన చార్జీలు అమల్లోకి రావడానికి వారానికి పైగా సమయంలో పడుతుంది అని ప్రకటించారు. సోమవారమే పెరిగిన చార్జీలను అమల్లోకి తేవాలని భావించిన టికెట్ మెషిన్లో అప్డేట్ చేయడానికి కొంచెం సమయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.

 

వాస్తవానికి కిమీకు 20 పైసలు పెంచుతున్నట్లు చెప్పిన, చిల్లర సాకు చూపుతూ ధరను రౌండాఫ్ చేశారు. ఉదాహరణకు ఒక పల్లెవెలుగు బస్సు లో 21 కిమీ దూరానికి టికెట్ ధర రూ 21 అనుకుందాం కిమీ కు 20 పైసలు పెంచుతున్నారు కనుక మొత్తం 420 పైసలు పెరుగుతుంది అంటే మునుపటి ధర రూ 21 కి ఈ 420 పైసలు అంటే రూ 4.20 కలిపితే రూ 25.20 అవుతుంది కానీ ధరను మాత్రం రూ 26 గా నిర్ణయించారు. ఇలా చిల్లర సాకు చూపెడుతూ ఆర్టీసీ వాయింపు మొదలెట్టింది.

 

ఇకపై పల్లెవెలుగులో కనీస టికెట్ ధర రూ 10 కానుంది. అత్యధికంగా బస్సులో ప్రయాణించే హైదరాబాద్ లో జనాల పైన పెను భారం పడనుంది. హైదరాబాద్ ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించే వారు ప్రస్తుతం కనీస టికెట్ ధర రూ 5 చెల్లిస్తుండగా ఇప్పుడు ఆ ధర కాస్తా రూ 10 కానుంది ఇక అలాగే ప్రతీ నాలుగు స్టాపులకు రూ 5 పెంచనున్నారు. ఇక లగ్జరీ బస్సులు అయిన డీలక్స్, రాజధాని, వజ్ర, గరుడ బస్సుల్లో చార్జీల గురించి చెప్పనక్కర్లేదు.

 

వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్లు ఆర్టీసి సమ్మె కాస్తా ప్రజల మీద మోయలేని భారాన్ని మోపింది. సమ్మె చేసింది ఆర్టీసి కార్మికులు అయితే శిక్ష మాకు వేస్తారా కెసిఆర్ సారూ అంటూ ప్రజలు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: