తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న న‌మ్మిన‌బంటుకు, ఆప్తుడికి గుడ్ న్యూస్ చెప్పారు. ఒక‌టి కాదు రెండు తీపి క‌బుర్ల‌ని ఆయ‌న‌కు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కొన‌సాగుతున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్‌శర్మ పదవీకాలాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం నాలుగేళ్లు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. అంతేకాకుండా....రాజీవ్‌శర్మ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి బోర్డు చైర్మన్‌గా కూడా నాలుగేండ్లు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన రాజీవ్‌శర్మ పదవీ విరమణ చేసిన అనంత‌రం  ఆత్మీయ వీడ్కోలు సభను సచివాలయంలో ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సంద‌ర్భంగా రాజీవ్ శ‌ర్మ‌పై కేసీఆర్ త‌న అభిమానాన్ని చాటుకున్నారు. `ఛత్తీస్‌గఢ్ తొలి సీఎస్‌గా శివరాజ్‌సింగ్ అనే అధికారి ఉండేవారు. రిటైర్ అయినా ఆయనపై ఉన్న ప్రేమ, ఆయన అందించిన సేవలకు గుర్తుగా ఆయనకు క్యాబినెట్ హోదా ఇచ్చి, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా పెట్టుకున్నారు. పదమూడున్నరేండ్లు అవుతున్నా.. ఆయన ఇంకా ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. రాజీవ్‌శర్మ సేవలను కూడా తెలంగాణ రాష్ట్రం మధురంగా హృదయంలో దాచుకుని గుర్తుపెట్టుకుంటుంది. రాజీవ్‌శర్మ సేవలను మనం ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆల్‌రౌండ్ ప్లేయర్. కాబట్టి మన రాష్ర్టానికి శర్మ సేవలు కచ్చితంగా అవసరం. అందుకే ఆయనను చీఫ్ అడ్వైజర్ టూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణగా నియామకం చేస్తున్నం.`` అని అక్క‌డిక‌క్క‌డే ప్ర‌క‌టించి...కేసీఆర్ త‌న మ‌నిషి అనే భావాన్ని స్ప‌ష్టంగా తెలియ‌జెప్పారు. 2016 డిసెంబ‌ర్‌లో జ‌రిగిన ఈ నియామ‌కం గ‌డువు ముగుస్తున్న నేప‌థ్యంలో..కేసీఆర్ మ‌ళ్లీ ఆయ‌న‌కు పొడ‌గింపు అవ‌కాశం ఇచ్చారు.

 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ విరమణ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రాధాన్యం కల్పిస్తూ ఆత్మీయ వీడ్కోలు సభను నిర్వహించడం ప్రభుత్వ అధికారిగా గొప్ప విషయంగా భావిస్తున్నానని పదవీ విరమణ చేసిన సీఎస్ రాజీవ్‌శర్మ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం పాటుపడుతున్నారని, ఇలాంటి సమయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా తనకు బాధ్యతలు అప్పగించడం మరుపురాని గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: