పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత టీ నందీశ్వర్‌గౌడ్ కుమారుడు ఆశిష్‌గౌడ్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. మద్యంమత్తులో ఆదివారం తెల్లవారుజామున ఆశిష్‌గౌడ్, ఆయన మిత్రగణం హైదరాబాద్ మాదాపూర్‌లోని నోవాటెల్ ఆర్టిస్ట్రీ పబ్‌లో వీరంగం సృష్టించి అక్కడున్న  సినీనటి సంజ‌న‌తో పాటు ఆమె మిత్రుల ప‌ట్ల‌ అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతం క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘటనపై బాధిత సినీనటి మాదాపూర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే, ఇదే స‌మ‌యంలో...బీజేపీ క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. ఆశిష్‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. 

 

మీడియా క‌థ‌నాల ప్ర‌కారం, మాదాపూర్ హైటెక్స్‌లోని ఆర్టిస్ట్రీ పబ్‌కు వెళ్లిన సినీనటి సంజ‌న‌, ఆమె స్నేహితురాళ్లు ఓ పక్కన నిలబడి సంగీతాన్ని వింటున్నారు. అప్పటికే మద్యంమత్తులో జోగుతున్న ఆశిష్‌గౌడ్, అతని మిత్రులు వారి వద్దకొచ్చి చేతులు పట్టి లాగారు. అంతటితో ఆగకుండా ఆశిష్‌గౌడ్ తీవ్ర పదజాలంతో ఆ యువతులను దుర్భాషలాడటంతోపాటు చేతిలో ఉన్న గ్లాసును నేలకేసి కొట్టి బెదిరించాడు. ఈ తతంగాన్ని ఆపాల్సిన బౌన్సర్ అజర్ కూడా యువతులనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని కేకలేసి వారిని అవమానపర్చాడు. ఆశిష్‌గౌడ్ దుశ్చర్యతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ సినీనటి అర్ధరాత్రి 2 గంటల సమయంలో మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ వార్త‌లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైర‌ల్ అయిన నేప‌థ్యంలో...బీజేపీ ఆయ‌న్ను స‌స్పెండ్ చేసింది. ఆశిష్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో రాష్ట్ర అధిష్టానం రంగారెడ్డి జిల్లా అధ్య‌క్షుడు సస్పెండ్ చేశారు.

 

ఇదిలాఉండ‌గా, సంజ‌న ఫిర్యాదు నేప‌థ్యంలో ఆశిష్‌గౌడ్‌తోపాటు మరో ఇద్దరు నిందితులపై ఐపీసీ 354. 354ఏ, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ పబ్‌లోని సీసీ కెమేరాల వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకొంటామని మాదాపూర్ పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: