భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన జరిగిన రోజును జాతీయ కాలుష్య నియంత్రణ దినంగా నిర్వ‌హిస్తున్నాం. కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఈ రోజును జరుపుకుంటున్నాం. అయితే స‌రిగ్గా ఇదే రోజు ఓ బీచ్‌లోని దారుణ స్థితి బ‌హిర్గ‌తం అయింది. మన చుట్టూ పరిసరాలు, సహజమైన గాలిలోకి చేరేదంతా కాలుష్యమేన‌ని...మనకు తెలియకుండా మనమే తెచ్చిపెట్టుకునే కాలుష్యం ఇప్పుడు మన భవిష్యత్తును సవాల్ చేస్తున్న త‌రుణంలోనే....ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అంద‌మైన ఓ బీచ్ విష‌పు నుర‌గ‌లు క‌క్కుతోంది. తమిళనాడులోని చెన్నైలోని మెరీనా బీచ్ కాలుష్యపు నురగలతో నిండిపోయిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

 


చెన్నైలోని మెరీనా  బీచ్ వెంబడి కిలోమీర్లకొద్ది నురగలు వ్యాపించి ఉన్నాయి. స్థానికంగా ఉండే పిల్లలు ఆ నురగలతో ఆడుకుంటూ…సెల్ఫీలు తీసుకుంటున్నారు. 2017లో బీచ్ లో ఏర్పడిన పొల్యూషన్ వల్ల చాలా చేపలు చనిపోయాయి. తాజాగా మళ్లీ అలాంటి ప‌రిస్థితే ఎదురైంది. ఈ నేప‌థ్యంలో...తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి నురగ నమూనాలను సేకరించింది. కాలుష్యం విస్త‌రించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఇదిలాఉండ‌గా, స్థానిక జాలర్లు మాత్రం తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కొన్ని రోజులపాటు తమ దగ్గర ఎవరూ చేపలు కొనరని తమ జీవనాదారం కోల్పోయామని చెప్పారు. మ‌రోవైపుకలుషితపు నీటితోనే ఇలాంటి నురగలు ఏర్పడుతాయని డాక్టర్లు చెప్తున్నారు. ఆనీటి వల్ల చర్మ సంబంధమైన వ్యాధులు వస్తాయని హెచ్చ‌రిస్తున్నారు. 

 

కాగా, మనకు మనంగా కొని తెచ్చుకునే కాలుష్యం మన ఆరోగ్యానికి ఎంతటి ముప్పును తెస్తుందో ఇప్పటికే చాలా మంది అనుభవిస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో...కాలుష్య నియంత్రణ అనేది ఇప్పుడు అత్యవసరంగా మారింది.  వాహనాల నుంచి వెలువడే పొగలు, విషవాయువులు, వివిధ కంపెనీల నుంచి వెలువడే కాలుష్యం కంటే అత్యధిక ప్రమాదకరమైనవిగా మారాయి. అందుకే...మ‌నం మారుదాం...మ‌నమంద‌రి ప్రాణాలు కాపాడుకుందాం.
  

మరింత సమాచారం తెలుసుకోండి: