జ‌న‌గామ చేతి గుర్తు పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు తార‌స్థాయికి చేరుకున్నాయి. జిల్లా పార్టీలో అంతా తానై జంగా రాఘ‌వ‌రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం పొన్నాల‌కు ఎంత‌మాత్రం మింగుడు ప‌డ‌టం లేద‌ట‌. కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయాల్లో రాష్ట్ర‌, జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలిగిన పొన్నాల ప్ర‌స్తుతం జంగాతో ప‌డ‌రాని ఇబ్బందులు ప‌డుతున్నార‌ని స‌మాచారం. పాల‌కుర్తి  నియోజ‌క‌వ‌ర్గంలో ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుపై పోటీ చేసి జంగా ఓట‌మిపాల‌య్యారు. అలాగే పొన్నాల ల‌క్ష్మ‌య్య జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గంలో ముత్తిరెడ్డిపై  పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. అయితే ఎన్నిక‌ల త‌ర్వాత పొన్నాల డీలా ప‌డ‌గా జంగా మాత్రం త‌న వ‌ర్గాన్ని పెంచుకుంటూ పార్టీ కార్య‌క్ర‌మాల్లో అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స‌మాచారం.

 

ఇటీవ‌ల ఆర్టీసీ స‌మ్మెల్లో కాంగ్రెస్ చేప‌ట్టిన ఆందోళ‌న‌లకు ల‌క్ష్మ‌య్య వ‌స్తే... జంగా గైర్హాజ‌ర‌వ‌డం.. జంగా వ‌స్తే పొన్నాల రాక‌పోవ‌డం వంటి సంఘ‌ట‌న‌లు వీరి మ‌ధ్య సాగుతున్న కోల్డ్ వార్‌కు అద్దం ప‌డుతోంద‌ని పార్టీ వ‌ర్గాలు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నాయి. అదే స‌మ‌యంలో అధిష్ఠానం వ‌ద్ద త‌న‌కెంతో బ‌ల‌ముంద‌ని..నేను తాటాకు చ‌ప్పుళ్ల‌కు భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని ల‌క్ష్మ‌య్య త‌న స‌న్నిహితుల వ‌ద్ద చెప్పుకుంటున్నార‌ని స‌మాచారం. అయితే పొన్నాల క‌న్నా జంగాకే అధిష్ఠానం అండ‌దండ‌లు ఉన్నాయ‌నేది జ‌న‌గామ కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో న‌మ్మ‌క ఏర్ప‌డుతోందంట‌.

 

టీ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డిలాంటి నేత అండ‌దండ‌లు జంగాకు పుష్క‌లంగా ఉండ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్నారు. అంతేకాక కాంగ్రెస్‌లో రెడ్డి వ‌ర్గానికే పెద్ద పీట అన్న విష‌యాన్ని గుర్తు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. అంతేకాక ఎన్నిక‌ల‌కు ముందు మాత్ర‌మే నియోజ‌క‌వ‌ర్గంలో హ‌డావుడి చేసే పొన్నాల ఎప్పుడు ? ఎక్క‌డ ఉంటార‌నేది నియోజ‌క‌వ‌ర్గ పార్టీ నేత‌ల‌కు క‌నీస స‌మాచారం ఉండ‌ద‌నే ఆరోప‌ణ ఉంది. అదే స‌మ‌యంలో ఆప‌ద‌లో... అవ‌స‌రాల్లో శుభ‌, అశుభ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతూ జంగా ఇప్పుడు అంద‌రివాడు అనిపించుకునే ప‌నిలో ఉండ‌టం విశేషం.

 

మొత్తంగా జిల్లా రాజ‌కీయాల‌పైనే కాదు పార్టీపై ప‌ట్టుకోల్పోయే ప‌రిస్థితిని పొన్నాల తెచ్చిపెట్టుకున్నారు. వ‌చ్చే ఐదేళ్ల నాటికి జ‌న‌గామ‌లో పాతుకుపోవాల‌న్న‌దే జంగా ల‌క్ష్యం కాగా...ప‌ట్టు స‌డ‌ల‌నివ్వ‌కుండా ఉండేందుకు..త‌న ప్రాబ‌ల్యాన్ని కోల్పోకూడ‌ద‌న్న ప‌ట్టుద‌ల‌తో పొన్నాల ఉన్నార‌ని స‌మాచారం. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చూస్తే పొన్నాల పొలిటిక‌ల్ కెరీర్ ముగిసిన‌ట్టే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: