జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో పవర్ స్టార్ గా పేరున్న జనసేనాని ఈసారి తెలుగు సినిమాపై నే ఘాటుగా విమర్శలు సంధించారు. తెలుగు సినిమా సాహిత్యం రోజురోజుకూ దిగజారి పోతోందన్నారు. తెలుగు సినిమా సాహిత్యం బూతు స్థాయికి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు.. సినిమా సాహిత్యం దిగజారిపోతే.. దిశ వంటి రేపులు జరగక ఇంకేమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

సినీ పరిశ్రమలో తెలుగు భాష దిగజారిపోతుందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషపై తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. తిరుపతిలో తెలుగు వైభవం పేరుతో పలువురు భాషపండితులతో ప్రత్యేక సమావేశాన్ని పవన్ కల్యాణ్ నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ... తెలుగు సినిమా హీరోల భాషపై ఘాటుగా స్పందించారు.

 

ఆయన ఏమన్నారంటే.. తెలుగు సినీ పరిశ్రమలో పాండిత్యం రానురాను దిగజారిపోతుంది. మన రచయితలకు శాస్త్రాలు, పాండిత్యం తెలియవు. శ్రీ మేడసాని మోహన్ గారిలాంటి అవధానులను ప్రేరణగా తీసుకుంటే గొప్పగొప్ప సినిమాలు వచ్చేవి. తెలుగు సినిమా స్థాయి బూతులు, తిట్లకు పడిపోయింది. ఈ స్థాయిలో ప్రమాణాలు దిగజారాయి కనుకే ఆడపిల్లలను రోడ్లమీదనే అత్యాచారాలు చేస్తున్నారు. మాతృభాషను మరిచిపొతే వచ్చిన దుస్థితి ఇది..అంటూ పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇన్నాళ్లూ టాలీవుడ్ లో పవర్ స్టార్ గా వెలుగొందిన పవన్ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడంతో సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కూడా ఇన్నాళ్లూ ఇదే రీతితో తెలుగు సినీ సాహిత్యం దిగజారేందుకు తన వంతు కృషి చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా మేలుకొన్నట్టు మాట్లాడటమేంటని విస్తుపోతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: